ఫిబ్రవరి 15న సెలవు ఉందా, లేదా? సీఎం నిర్ణయంపై ఉత్కంఠ

by Bhoopathi Nagaiah |

ఫిబ్రవరి 15న సెలవు ఉందా, లేదా? సీఎం నిర్ణయంపై ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్ : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ (Sant Sri Sevalal Maharaj) జయంతిని ఆ సామాజిక వర్గ ప్రజలు పండుగలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు ఉత్సవాలు నిర్వహించుకుంటారు. ఈ నెల 15న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి. దేశ వ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది బంజారాలు సేవాలాల్ జయంతిని ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ దేశమంతా సంచరిస్తూ బంజారాలకు హితబోధ చేసిన మహోన్నతమైన వ్యక్తి ‘సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్’. యావత్ భారత దేశం అంతా సంచరిస్తూ ఉప్పు అమ్ముకుంటూ, ఆవులను మేపుకుంటూ దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ మహారాజ్ ఏకం చేశారు. స్థిరనివాసం ఆవశ్యకతను తెలిపి, బంజారా జాతిని మూఢనమ్మకాల నుంచి హింసా, మద్యపానం మొదలైన వ్యసనాలకు బానిస కాకుండా స్వచ్ఛమైన జీవనం కొనసాగించాలని బంజారాల గురువు ‘సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్’ హితోపదేశం చేశారు. ఈ నేపథ్యంలోనే గిరిజనులు ఆయనును దేవుడిగా భావిస్తారు. సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించుంటారు.

ఈ సందర్భంగా ఫిబ్రవరి 15న సెలవు దినం(Holiday)గా ప్రకటించాలని బంజారాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది సేవాలాల్ జయంతి రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ఈ సంవత్సరం కూడా హాలీడే ఇవ్వాలని కోరుతురున్నారు. ఈ మేరకు నిన్న (ఫిబ్రవరి 12) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని బంజార సంఘం నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. మంత్రి సీతక్క(Minister Seethakka)తో కలిసి వెళ్లిన గిరిజన నేతలు సేవాలాల్ జయంతికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఫిబ్రవరి 15న సెలవుపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ రోజు హాలీడే ఉంటుందా.. ఉండదా? సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై గిరిజనుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy), రఘునందన్ రావు(Madavaneni Raghunandan Rao), డీకే అరుణ (DK Aruna) విలేకరులతో మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌(Gajendra Singh Shekhawat)ను కోరారు. ఈ అంశంలో అవసరం అయితే అమిత్ షా(Amit Shah), ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని, దీనిని ఇకపై దేశవ్యాప్తంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

Next Story