మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తప్పించే అవకాశం.. ముహూర్తం సైతం ఖరారు?

by Gantepaka Srikanth |

దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖను త్వరలో పదవి నుంచి తప్పించనున్నారా? తాజాగా ఆమెను మెదక్​జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాధ్యతల నుంచి తప్పించడమే దీనికి సంకేతమా? అంటే అవుననే సమాధానం సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున వినిపిస్తున్నది.

మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తప్పించే అవకాశం.. ముహూర్తం సైతం ఖరారు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖను త్వరలో పదవి నుంచి తప్పించనున్నారా? తాజాగా ఆమెను మెదక్​జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాధ్యతల నుంచి తప్పించడమే దీనికి సంకేతమా? అంటే అవుననే సమాధానం సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున వినిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆమెను మినిస్టర్ పోస్టు నుంచి తప్పించనున్నారనే ప్రచారం జరుగుతున్నది. కొంత కాలంగా కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారని, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని పార్టీ అదిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఆ పార్టీకి చెందిన నేతలే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికప్పుడు తొలగిస్తే ఎలా? అనే కోణంలోనూ పార్టీలో చర్చ జరిగిందని, దీంతో ఆమె తొలగింపు తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం.

వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు

సినీ హీరో నాగార్జున, ఆయన మాజీ కోడలు సమంతపై కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ వర్గాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై నాగార్జున కోర్టుకు ఎక్కారు. సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్​చేయాలని, చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఈ ఇష్యూపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది. పార్టీ జాతీయ నాయకత్వం సైతం రాష్ట్ర నాయకుల నుంచి సమాచారం అడిగినట్టు తెలిసింది. అప్పుడే సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జరిగింది.

ఇతర మంత్రులు డబ్బులు తీసుకుంటారని..

వరంగల్‌లో ఇటీవల జరిగిన కృష్ణా కాలేజీ కొత్త భవనం ప్రారంభోత్సవంలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఆ సమయంలో ‘ఇతర మంత్రులైతే ఏదైనా పనులు చేస్తే డబ్బులు తీసుకుంటారు.. కానీ తాను సీఎస్‌ఆర్​కింద విద్యార్థులకు ఉపయోగపడేలా కొత్త భవనం నిర్మించి ఇవ్వాలని చెప్పాను’.. అని కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో మరోసారి ప్రభుత్వం, మంత్రులు, పార్టీ ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఆ వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఎంతగా సమర్థించుకున్నా.. తన ఉద్దేశం అది కాదని చెప్పినా.. జరగాల్సిన డ్యామేజీ జరిగిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

నలుగురు ఎమ్మెల్యేల ఫిర్యాదు

కొండా సురేఖ వ్యవహార శైలిపై ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్​ఎమ్మెల్యేలు ఇప్పటికే రెండు సార్లు పార్టీ కీలక నేతలకు, రాష్ట్ర కాంగ్రెస్​వ్యవహారాల ఇన్‌చార్జికి ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గంలో ఉద్దేశ పూర్వకంగా జోక్యం చేసుకుంటూ తమను డిస్టర్బ్​చేస్తున్నారంటూ కంప్లాయింట్ చేశారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని అనుకున్నా.. పార్టీ రాష్ట్ర పెద్దలు జోక్యం చేసుకోవడంతో సదరు ఎమ్మెల్యేలు ఊరుకున్నారు.

క్వారీల ఇష్యూలో మీనాక్షి వివరణ

తమ శాఖకు చెందిన అధికారుల ద్వారా కొండా సురేఖ తమ నియోజకవర్గంలో క్వారీలకు నోటీసులు ఇచ్చి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్​చేశారని ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కంప్లాయింట్ చేయడంతో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్​జోక్యం చేసుకున్నారు. దీనిపై సురేఖను వివరణ అడిగారు. ‘ఏమిటీ ఫిర్యాదులు.. ఎందుకు ఇలా చేస్తున్నారు’ అంటూ వివరణ అడిగినట్లు సమాచారం. మీనాక్షి వివరణ అడిగిన కొద్ది రోజుల్లోనే కొండా సురేఖను మెదక్​జిల్లా ఇన్‌చార్జి మంత్రి పోస్టు నుంచి తొలగించారు.

‘స్థానికం’ తర్వాత పదవి పోవడం ఖాయమంటూ గుసగుసలు

మంత్రివర్గ విస్తరణ సమయంలోనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. అయితే ఈ సారి తొలగింపులు లేకుండా కేవలం చేర్పులు మాత్రమే ఉండటంతో ఆమె పదవి పోలేదని.. లేకుంటే పోయేదే అంటూ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి సురేఖను ఇన్‌చార్జి మంత్రిగా తొలగించారని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆమె పదవికి గండం పొంచి ఉందని నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

Next Story