రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు... పలు జిల్లాలకు హెచ్చరికలు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-24 17:05:09  IST  )

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు... పలు జిల్లాలకు హెచ్చరికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుందని, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరులో అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా ములుగు జిల్లాలోని వెంకటాపురంలో కూడా భారీ వర్షాలు కురిశాయి.

ఇక్కడ 23 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు చేపడుతున్నారు.

హెచ్చరికలు జారీ:

30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి, జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

గురువారం నమోదైన వర్షాపాతం వివరాలు:

కరీంనగర్ 12 సెం.మీ, ములుగు జిల్లా ఏటూరు నాగారం 10 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా మల్యాల్ 9 సెం.మీ, భూపాలపల్లి జిల్లా మెుగుళ్ల పల్లిలో 9 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 9 సెం.మీ, సిద్దిపేట్ జిల్లా దుబ్బాకలో 8 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 8 సెం.మీ, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 7 సెం.మీ, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో 7 సెం.మీ, సంగారెడ్డి జిల్లా నేకల్ లో 7 సెం.మీ, భూపాలపల్లి జిల్లా చిట్యాల్ 7 సెం.మీ, రేగొండలో 7 సెం.మీ, ములుగు జిల్లా తాడ్వాయిలో 7 సెం.మీ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో 7 సెం.మీ, నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో 6 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story