- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ ఎల్ నినోను ఎదుర్కొంటాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సూపర్ ఎల్ నినో పరిస్థితులు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశమున్నదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సూపర్ ఎల్ నినో పరిస్థితులు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశమున్నదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హోటల్ అవాసాలో సింపోజియం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాతావరణ మార్పులు అంశంపై సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు.
గతంలో నమోదైన వర్షపాతం నమూనాల ఆధారంగా ఇకపై జలవనరుల ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిర్వహణలో కొత్త వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలపాటు రాష్ట్రానికి అనుకూలమైన వర్షపాతం నమోదై రిజర్వాయర్లు సమృద్ధిగా నిండాయని.. సాగు, తాగునీటి అవసరాలు సాఫీగా నెరవేరాయని తెలిపారు. అయితే.. ప్రస్తుత వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని పేర్కొన్నారు. నిపుణులు సూచిస్తున్న సూపర్ ఎల్ నినో పరిస్థితులను ప్రభుత్వం అత్యంత గంభీరంగా పరిగణిస్తున్నదని తెలిపారు.
వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నీటిపారుదల, వ్యవసాయం, తాగునీరు, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయని చెప్పారు. రిజర్వాయర్ల నిర్వహణలో రియల్‌టైమ్ డేటా వినియోగం, శాస్త్రీయ నిర్ణయాలు, శాఖల మధ్య సమన్వయంతో ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ అనిశ్చిత పరిస్థితుల నుంచి రైతులను రక్షించగలగడమే ప్రభుత్వాల అసలైన పరీక్ష అని మంత్రి పేర్కొన్నారు. గతంలో జరిగిన ఆక్రమణల వల్ల నగరంలో వరద ముప్పు పెరిగిందని.. ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, సహజ డ్రైనేజీ వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.






