- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Seethakka: జైలుకెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్.. ఎందుకు భయపడుతున్నావ్.. మంత్రి సీతక్క
ఇటీవల పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను, నేడు అసెంబ్లీలో దలిత స్పీకర్‌ను అవమానించారని మంత్రి సీతక్క (Seethakka) మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను, నేడు అసెంబ్లీలో దలిత స్పీకర్‌ను అవమానించారని మంత్రి సీతక్క (Seethakka) మండిపడ్డారు. శుక్రవారం (TG Assembly Sessions) అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనం చేకూర్చే భూభారతి బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల భూకబ్జాల బాగోతం బయటపడుతుందని సభను పక్క దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేబినెట్ ఆమోదం తీసుకొని ఫార్ములా ఈ రేస్ కు కేటీఆర్ డబ్బులు చెల్లించారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకు? అని నిలదీశారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుకు సభలో చర్చ అవసరం లేదని తేల్చిచెప్పారు.
మరోవైపు బీఏసీలో ఈ ఫార్ములా ఈ రేస్ మీద చర్చ కోసం బీఆర్ఎస్ ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు. ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ (KTR) ఎందుకు భయపడుతున్నారు.. అంటూ విమర్శించారు. తప్పు లేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటకు రావచ్చు కదా? అని అన్నారు. కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్య గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే తప్పు పట్టిన కేటీఆర్.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు నిజాయితీ లేదని, అందరూ చట్టం ముందు సమానులే.. ఫార్ములా ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పారు.






