- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ‘ఓటు చోరీ’పై రాహుల్ ఎందుకు మాట్లాడరు.. మాజీ మంత్రి హరీశ్‌రావు
బిహార్‌లో ‘ఓటు చోరీ’ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ‘ఓటు చోరీ’పై ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బిహార్‌లో ‘ఓటు చోరీ’ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ‘ఓటు చోరీ’పై ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకురాలు కళావతి, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు బి.లక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మీ, అనురాధ, మంజుల, సత్యవతితో పాటు 200 వందల మంది బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గోపీనాథ్ సతీమణి సునీత గెలవాలని, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలని బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరడం గొప్ప విషయమని అన్నారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని.. ఆడబిడ్డను అవమానించే విధంగా మంత్రులు మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. విజ్ఞత మరిచి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.
రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయో ప్రజలు ఒకసారి ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. రెండు పార్టీలూ రాష్ట్రానికి ద్రోహమే చేశాయన్నారు. రాహుల్‌గాంధీ మొహబ్బత్‌కి దుకాణ్ అని అంటారని.. మోడీ ఏమో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని అంటారని.. కానీ హైడ్రా పేరిట పేదవారి ఇల్లు కూలగొట్టడం మొహబ్బత్ దుకాణ్ ఆ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్లలోనే ఉన్నదని.. ఎమ్మెల్యే గాంధీ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టారని ఆరోపించారు. పండుగ పూట, ఆదివారం రాత్రి వచ్చి గరీబోళ్ల ఇళ్లు కూలగొట్టి వేల కుటుంబాలను రేవంత్ రోడ్డుమీదికి తెచ్చారని అన్నారు. రాహుల్‌గాంధీ రేవంత్‌రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. సునీతను ఓడగొట్టాలని 20 వేల దొంగ ఓట్లను కూడగట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన బస్తీ దవాఖానాలలో కనీసం మందులు లేని పరిస్థితి ఉందన్నారు. రేవంత్‌రెడ్డిని ఓడిస్తేనే బుద్ధి వస్తుందని చెప్పారు. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో చెప్పించారని.. వారు పత్తాకు లేరని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ వచ్చుడే కష్టమని జోస్యం చెప్పారు. తెలంగాణ నీటిని దోపిడీ చేసే బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర బీజేపీ మద్దతిస్తున్నదని.. అనుమతులు ఇస్తున్నదని ఆరోపించారు. తెలంగాణకు ఏమిస్తున్నారో బీజేపీ నాయకులు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.






