- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మళ్లీ ఆంధ్ర నేతల విగ్రహాలెందుకు?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అల్లం నారాయణ
దశాబ్దాల పోరాటం, ఎందరో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మళ్లీ దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్దాల పోరాటం, ఎందరో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మళ్లీ దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. పన్నెండేళ్ల స్వరాష్ట్రంలో తిరిగి ఆంధ్రా నేతల పెత్తనం పెరిగిపోతోందని, రాష్ట్ర ప్రయోజనాలను ప్రస్తుత ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఫోరం నేతలు విమర్శించారు. టీజేఎఫ్ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం గన్‌పార్క్ వద్ద జర్నలిస్టులు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. రజతోత్సవాల ముగింపు కార్యక్రమంలో టీజేఎఫ్ అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ఫోరం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మళ్లీ ఆంధ్ర నేతల విగ్రహాలు ఎందుకు?
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి, తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం గడుస్తున్న తరుణంలో హైదరాబాద్ మహానగరంలో మళ్లీ ఆంధ్ర ప్రాంత నేతల విగ్రహాలను ప్రతిష్టించడంలో ఆంతర్యమేమిటని అల్లం నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని నడిబొడ్డున ఇలాంటి చర్యలకు పాల్పడటం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి పాలనలో సమైక్యాంధ్ర వాదుల కుట్రలను తిప్పికొట్టి, తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి చైతన్యం చేయడంలో టీజేఎఫ్ చారిత్రక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. నాడు ఉద్యమ సమయంలో పోషించిన ఆ క్రియాశీలక పాత్రను.. నేడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ పోషించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.
సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో పనిచేస్తున్న సీఎం
అనంతరం ఫోరం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత సీఎం రేవంత్ పూర్తిగా సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని, వారి కనుసన్నల్లోనే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను, రాష్ట్ర హక్కులను పాలకులే సీమాంధ్రులకు తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణ ఉనికికే తీవ్ర ప్రమాదం ఏర్పడే దుస్థితి వస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జర్నలిస్టులు పాల్గొని అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు ఎ.రమణ కుమార్, కందుకూరి రమేష్ బాబు, రమేష్ హజారి, యార నవీన్ కుమార్, గుంటిపల్లి వెంకట్, కడకంచి వెంకటేష్, ధన్ రాజ్, రాకేష్ రెడ్డి, బాపు రావు, బిజ్జిగిరి శ్రీనివాస్, ఫోటో జర్నలిస్ట్‌ల అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.






