అర్ధరాత్రి అగ్నికీలలు.. పత్తిగింజలకే మంటలు ఎందుకు..?

by Ramesh Naini |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

అర్ధరాత్రి అగ్నికీలలు.. పత్తిగింజలకే మంటలు ఎందుకు..?
X

దిశ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదంలో దాదాపు రెండు వేల క్వింటాళ్ల పత్తి గింజల బస్తాలు దగ్ధమైనట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీగా ఎగిసిపడిన మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మధ్యలోనే పత్తిగింజలకు మంటలు..!

మిల్లులో రెండు వైపులా భారీగా నిల్వ చేసిన వడ్ల బస్తాలకు పెద్దగా నష్టం జరగకపోగా మధ్యలో ఉన్న పత్తిగింజల బస్తాలకే మంటలు వ్యాపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అగ్ని ప్రమాదానికి గల అసలు కారణంపై ఫైర్ అధికారులు, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అదుపులోకి రాని మంటలు!

మంటలు చెలరేగిన వెంటనే మిల్లు సిబ్బంది, స్థానికులు తమ వంతు ప్రయత్నాలు చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటన స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అప్పటికే భారీ మొత్తంలో పత్తిగింజల బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరికొంత ఆలస్యమై ఉంటే పక్కనే నిల్వ ఉన్న వడ్ల బస్తాలకు కూడా మంటలు వ్యాపించి మరింత భారీ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు.

ఫైర్ సేఫ్టీ తనిఖీలు ఎక్కడ..?

అంత పెద్ద పరిశ్రమలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు అమలులో ఉన్నాయా..? అగ్నిమాపక పరికరాలు పనిచేసే స్థితిలో ఉన్నాయా..? అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయా..? సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించారా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పలుమార్లు ఫిర్యాదులు... చర్యలు శూన్యం..!

మిల్లు నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ గతంలో పలుమార్లు మండల అధికారులకు, ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. సంబంధిత శాఖలు అప్పుడే స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని వారు పేర్కొన్నారు.

అధికారుల నివేదికలోనూ నక్ష బాట ఆక్రమణ..!

మిల్లు నక్ష బాటను ఆక్రమించి నిర్మించబడినట్లు సంబంధిత అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక నివేదికలు, ఫిర్యాదు పత్రాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎఫ్టీఎల్​జోన్‌లోనే మిల్లా..?

మిల్లు పూర్తి ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలోనే నిర్మించబడినట్లు అధికారిక రికార్డులు తమ వద్ద ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. వర్షాకాలంలో చెరువు నీరు మిల్లు వెనుక భాగం వరకు చేరిన ఫోటోలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్, పరిశ్రమలు, ఫైర్ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు.

దుమ్ము ధూళితో ఉక్కిరిబిక్కిరి

మిల్లు నుంచి నిత్యం వెలువడుతున్న దుమ్ము, ధూళితో పరిసర గ్రామాల రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పంట పొలాలపై దుమ్ము పేరుకుపోవడంతో దిగుబడులపై ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొందరిలో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యమా..?

అక్రమ నిర్మాణాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు గ్రామస్తుల్లో వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు.

ఇన్సూరెన్స్ కోణంపైనా విచారణ చేయాలి

అగ్నిప్రమాదం అనంతరం బీమా (ఇన్సూరెన్స్) అంశంపైనా గ్రామస్తులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. అందువల్ల ప్రమాదానికి గల అన్ని కారణాలతో పాటు ఈ కోణంపైనా సమగ్ర దర్యాప్తు జరపాలని వారు కోరుతున్నారు.

పరిస్థితిని సమీక్షించిన ఫైర్ అధికారులు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇల్లంతకుంట ఎస్సై అశోక్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్ మంటలను పూర్తిగా ఆర్పివేసిన అనంతరం పరిస్థితిని సమీక్షించారు. అగ్నిప్రమాదం ఎలా సంభవించింది, దానికి గల కారణాలేమిటనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరపాలి

అగ్ని ప్రమాదానికి గల అసలు కారణంతో పాటు మిల్లు నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నక్ష బాట ఆక్రమణపై ఉన్న అధికారిక నివేదికలు, ఎఫ్టీఎల్ జోన్‌కు సంబంధించిన రికార్డులు, ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు, గతంలో సమర్పించిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు అన్నింటినీ సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story