TG: భూ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఎవరు చేస్తారు?.. అన్నింటికీ పరిష్కార మార్గం

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-22 15:24:47  IST  )

తెలంగాణ భూ పరిపాలన మార్పుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ధరణి లేదా ఆర్వోఆర్ 2020 వైఫల్యాల కారణంగా లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. తరతరాలుగా దున్నుకుంటున్న భూములపైనే హక్కులు కోల్పోయారు.

TG: భూ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఎవరు చేస్తారు?.. అన్నింటికీ పరిష్కార మార్గం
X

శిరందాస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ భూ పరిపాలన మార్పుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ధరణి లేదా ఆర్వోఆర్ 2020 వైఫల్యాల కారణంగా లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. తరతరాలుగా దున్నుకుంటున్న భూములపైనే హక్కులు కోల్పోయారు. ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ పరిష్కార మార్గాలే లేవు. పరిష్కరించాలనుకున్నా చట్టం అధికారుల చేతులు కట్టేసింది. ఇంకొన్నేమో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అవగాహనలోపం, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో అపరిష్కృతంగా మిగిలాయి. ఒకటీ రెండు కాదు.. నేటికీ లక్షలాది మంది తమ భూ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తహశీల్దార్ అన్యాయం చేశాడని భావిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి ఇన్నాండ్లుగా నెలకొన్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో వారిపై నమ్మకంతో ధరణి బాధితులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. ఈ నేపధ్యంలోనే కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించారు. భూ భారతి పేరిట కొత్త నిబంధనావళి అమల్లోకి వచ్చింది. ఐతే ఇప్పటికే అనేక అనుమానాలు, ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ధరణి ద్వారా చేయలేనిది భూ భారతితో చేయగలిగే పనులు ఏమిటంటూ సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. ఇన్నాండ్లుగా తమ సమస్యకు పరిష్కారం చూపలేదు. ఇప్పుడైనా అవకాశం ఉందా? అంటూ అనేక మంది బాధితులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు భూ భారతి, ధరణి విధానాల్లో అనేక తేడాలు ఉన్నాయి. ఈ కొత్త ఆర్వోఆర్ 2025 ద్వారా ఏమేం చేయగలరు? ఏయే పాత సమస్యలకు పరిష్కారం ఉంది? ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉన్నది. వీటికి సమాధానాలు ఎవరి నుంచి చెప్పిస్తే బాగుంటుంది? ఆ చట్ట రూపకర్త, మార్గదర్శకాలను రాసిన భూ చట్టాల నిపుణులు, వ్యవసాయం రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ (భూమి సునీల్) ని అడిగి సామాన్యుల్లో నెలకొన్న ప్రశ్నలు, వాటికి సమాధానాలను ‘దిశ’ సేకరించింది. ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉంది? పరిష్కరించకపోతే ఏం చేయొచ్చు? అసలు ఎలా అప్లై చేయాలి? ఇప్పుడీ కొత్త వ్యవస్థ అమలు తీరుతెన్నులపై నెలకొన్న అన్ని అంశాలను ‘దిశ’ పాఠకులకు అందిస్తున్నాం. మీరు ఎదుర్కొంటున్న సమస్య, దాని పరిష్కార మార్గాన్ని అందిస్తున్నాం. ఎవరైనా అధికారి ఇప్పటికీ దరఖాస్తును పెండింగులో పెడితే ఏ చట్టం ప్రకారం, ఎలా చేయొచ్చునో మీరే సూచించే వీలుంది.

1. పార్టు బి భూ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఎవరు చేస్తారు?

+ 2018 నుంచి 18 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేయలేదు. అంటే ఏకంగా 5 నుంచి 6 లక్షల మంది రైతులు తమ భూములకు హక్కులు పొందలేదు. ఇందులో 23 రకాల సమస్యలు ఉన్నాయి. భూ భారతి చట్టంలో వీటికి పరిష్కార మార్గం ఉంది. సెక్షన్ 4(6), రూల్ 6 ప్రకారం పరిష్కరించడానికి వీలున్నది. అప్లికేషన్ పెట్టుకుంటే విచారణ చేసి పరిష్కరించే అధికారాన్ని ఆర్డీవోకు కట్టబెట్టారు. న్యాయం దక్కకపోతే కలెక్టర్ కి అప్పీల్ కి వెళ్లొచ్చు. అక్కడా అన్యాయం జరిగిందని భావిస్తే ట్రిబ్యునల్ కి వెళ్లొచ్చు. భూ భారతి పోర్టల్ ద్వారా రూ.1000 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. లేదంటే జూన్ రెండో తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అప్పుడు ఫిజికల్ గానూ అప్లై చేసుకోవచ్చు. సదస్సుల్లోనైతే గ్రామాల్లోనే పరిష్కారం దొరికే అవకాశం ఉంది.

2. పాసు పుస్తకాల్లో సర్వే నంబర్లు మిస్సింగ్, విస్తీర్ణం తక్కువ నమోదైన దరఖాస్తులకు పరిష్కారం చూపడం లేదు. ఇప్పుడు ఎలాంటి మార్గం ఉంది?

భూ భారతి చట్టం సెక్షన్ 4, 5, రూల్ 4 ప్రకారం రికార్డుల్లో తప్పులు ఉంటే ఆర్వోఆర్ రెక్టిఫికేషన్ మాడ్యూల్ లో అప్లై చేసుకోవాలి. ధరణి రికార్డుల్లో తప్పులు ఉన్నా, రికార్డుకి ఎక్కకపోయినా ఇదే మాడ్యూల్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆర్డీవో నోటీసులు ఇస్తారు. నోటీసులు ఆ సర్వే నంబరులోని మిగతా వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారు. వారి రికార్డులను పరిశీలించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆర్వోఆర్ రికార్డులన్నింటినీ పరిశీలించి చేయొచ్చు. ఆర్వోఆర్ 1971, ఆర్వోఆర్ 2020 ప్రకారం పొందిన పాసు పుస్తకాలు, పహానీలను సమర్పించాలి. ఆ డాక్యుమెంట్లల్లో ఉండి, రికార్డుల్లో లేకపోతే ఆర్డీవో చేయడానికి వీలున్నది. పొషిషన్ లో ఉన్నట్లు చూపిస్తే పరిష్కార మార్గం ఇంకా ఈజీ అవుతుంది. ఓ వైపు రికార్డులు, మరో వైపు పొషిషన్ ని గుర్తిస్తే ఈ సమస్యకు పరిష్కారం పెద్ద కష్టమైనది కాదు.

3. పట్టా భూములను నిషేదిత జాబితాలో నమోదు చేశారు. తొలగించాలన్న దరఖాస్తు చేసుకుంటే ఏండ్లు గడుపుతున్నారు. ఇప్పుడు ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు?

నిజం. చాలా సమస్యలు పేరుకుపోయాయి. ఒకటేమో భూ భారతి దీని మూలాలను వెతకాలని సూచిస్తున్నది. ఖాస్రా పహానీ, సేత్వార్ లను చూడాలి. అందులోని క్లాసిఫికేషన్ ప్రకారం చేయాల్సిందే. రెండోది.. మధ్యలో చాలా కాలం పట్టా అని ఉంటుంది. ఇప్పుడేమో ఖాస్రా, సేత్వార్ ప్రకారం ప్రభుత్వానిదంటూ పీవోబీలో పెట్టారు. నిజానికి హైకోర్టు, సుప్రీం కోర్టు ఇలాంటి కేసుల్లో అనేక తీర్పులు వెలువరించాయి. సేత్వార్ ఒక ఎవిడెన్స్ మాత్రమే. అదే పూర్తి ఎవిడెన్స్ కాదు. ఆ తర్వాత పహానీలను కూడా పరిశీలించాలి. కనీసం 30 ఏండ్ల పాటు పట్టాగా పహానీల్లో ఉంటే దాన్ని విచారించి, రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్డీవో దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. గుడ్డిగా సేత్వార్ ప్రామాణికం అంటూ దరఖాస్తులను రిజెక్ట్ చేయడం సరైంది కాదు. ఇప్పుడు భూ భారతిలో మిగతా రికార్డులను పరిశీలించాలని సూచిస్తున్నది. మరో అంశమేమిటంటే 50, 60 ఏండ్లుగా పట్టాగా పహానీల్లో రాశారు. దాంతో అనేక క్రయ విక్రయాలు జరిగాయి. ఇప్పుడు సేత్వార్ ప్రకారం ప్రభుత్వానిదని నిర్ణయిస్తే పట్టాదారుడి నుంచి స్వాధీనం చేసుకునే వీలు కూడా లేదు. ఇన్నాండ్ల తర్వాత హక్కులు లేవని చెప్పడానికి ఏ చట్టం అంగీకరించదు. అన్నింటి కంటే ఆర్వోఆర్ 1971 ప్రకారం 1989 నుంచి 1996 వరకు ఆర్వోఆర్ రిజిస్టర్ ఒకటిని తయారు చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

4. ఒకరి భూమిని మరొకరి పేరిట రాశారు. సరి చేయాలంటూ మేం చేయం. మీరు కోర్టుకే వెళ్లాలంటూ తహశీల్దార్లు అన్నారు. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు?

నిజంగా ఇది అన్యాయం. ఇలాంటి వాటికి ధరణిలో పరిష్కార మార్గాలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీటిని పరిష్కరించాలని సర్క్యులర్ ఒకటిని జారీ చేసి తహశీల్దార్లకు అధికారాలను కట్టబెట్టారు. ఐనా భూ భారతి ద్వారా సెక్షన్ 4, 6 ద్వారా ఆర్డీవో చేయడానికి అధికారం ఉన్నది. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు, పొషిషన్, పాత పాసు పుస్తకాలు, కొత్త పాసు పుస్తకాలు, పహానీలు, 1 బి ఎంట్రీలు వంటివి సమర్పిస్తే పరిశీలించి చేయాల్సిందే. ఇక నుంచి కోర్టుకు వెళ్లాలంటూ సూచించే అవకాశం రెవెన్యూ అధికారులకు లేదు.

5. తహశీల్దార్లకు అధికారాలు ఇస్తామన్నారు. రూల్స్ లో మాత్రం అన్నీ ఆర్డీవో, కలెక్టర్లకే కట్టబెట్టారు కదా. ఎందుకు?

సెక్షన్ 4, 5, 6 రూల్ 4(4) ప్రకారం కరెక్షన్ అధికారాలు లేవు. గతంలో సీసీఎల్ఏకు ఉండే అధికారాలను ఇప్పుడు ఆర్డీవోకు అప్పగించారు. ఐతే ఆర్వోఆర్ మ్యుటేషన్ అధికారం తహశీల్దార్లదే. ఇప్పుడు ల్యాండ్ గ్రీవెన్స్ మాడ్యూల్ అధికారాలు కూడా తహశీల్దార్లకు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ నడుస్తున్నది. సర్క్యులర్ 1 ప్రకారం ఇస్తే బాగుంటుందంటున్నారు. కానీ కొత్త అధికారాలు కూడా వచ్చాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో మ్యాప్, భూదార్, గ్రామ లెక్కల నిర్వహణ, జీఎల్ఎం మాడ్యూల్ వంటివి తహశీల్దార్లకే. ఐతే ఆర్డీవో స్థాయిలోని కొన్ని అధికారాలను తహశీల్దార్లకు అప్పగించొచ్చు. అలాగే గతంలో సాదాబైనామాల పరిష్కారం తహశీల్దార్లకు ఉండేది. ఇప్పుడన్నీ ఆర్డీవోలకు ఇచ్చారు. దాంట్లోనే మార్కెట్ విలువ ఆధారంగా తహశీల్దార్లకు ఇస్తే బాగుంటుంది. ఐతే ఈ సాదాబైనామాలు నిరంతరం కాదు. పెండింగులోని అప్లికేషన్లకే పరిమితం. ఒక్కసారి పూర్తయితే ఇక ఆ అధికారాలు ఉన్నా పనికి రావు. ఆర్వోఆర్ చట్టం ప్రకారం సంక్రమించే అధికారాలపైనే చర్చ నడుస్తుంది. కానీ మిగతా పీవోటీ, టెనెన్సీ, రెవెన్యూ రికవరీ యాక్ట్, కౌలుదారు చట్టం వంటి వాటిల్లో అన్నీ తహశీల్దార్లకే ఉన్నాయి. అలాగే ప్రతి దానికి ఎంక్వయిరీ అధికారి కూడా తహశీల్దారే. అలాగే కొన్ని రకాల మ్యుటేషన్ల బాధ్యతలను ఆర్డీవోలకు ఇచ్చారు. ఐతే ఓఆర్సీ, 31ఈ వంటివి ఆర్డీవో జారీ చేస్తారు. వారే అమలు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే వారికి అధికారాలను కట్టబెట్టారు.

6. జీపీవోల నియామకం కాలేదు. ఇప్పుడు విచారణ ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు?

భూ భారతి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే నాటికి జీపీవోల నియామకం పూర్తవుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ ప్రాసెస్ నడుస్తుందని చెప్పారు. జూన్ 2 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. ఆ లోపు, తర్వాత కానీ తప్పనసరిగా గ్రామ స్థాయిలో ఒక ఉద్యోగి తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే అప్లికేషన్ల స్వీకరణ పూర్తయ్యింది. త్వరలోనే నియామకాల ప్రక్రియ మొదలువుతుంది.

7. అప్పీల్ వ్యవస్థ ఆన్ లైన్ లో ఉంటుందా? ఆఫ్ లైన్ లో ఉంటుందా?

అప్పీల్ వ్యవస్థ భూ భారతిలో ఆన్ లైన్ లోనే ఉంటుంది. ఆఫ్ లైన్ లో చేస్తే రికార్డులను మారుస్తారన్న భయం ఉంది. దరఖాస్తుదారుడు సమర్పించే డాక్యుమెంట్లు యథాతథంగా ఉంటాయి. ఐతే ఆర్వోఆర్ 1971 ప్రకారం అప్పీల్ వ్యవస్థ ఉండేది. కానీ ఆర్వోఆర్ 2‌‌020 ప్రకారం పూర్తిగా తొలగించారు. ఒకవేళ ఏదైనా అన్యాయం అనిపిస్తే కోర్టుకు వెళ్లాల్సిందే. అదే ఆర్వోఆర్ 2025 భూ భారతిలో పేద రైతులు నష్టపోకూడదని ఈ అప్పీల్ వ్యవస్థను మూడంచెలుగా రూపొందించారు. తహశీల్దార్ చేయకపోతే ఆర్డీవో, ఆర్డీవో చేయకపోతే కలెక్టర్, కలెక్టర్ చేయకపోతే ట్రిబ్యునల్ కి వెళ్లే అవకాశం కల్పించారు. దీని ఎలాంటి ఖర్చు దరఖాస్తుదారుడికి ఉండదు. ఐతే అప్పీల్ ఎలా చేసుకోవాలో తెలియజేసేందుకు ప్రతి మండల కార్యాలయంలో హెల్ప్ డెస్కులు పెట్టాలని సూచించాం. ఫిజికల్ గా కాపీలు తీసుకొస్తే అక్కడి సిబ్బంది ఆన్ లైన్ లో అప్పీల్ చేయించే బాధ్యతను లేదా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తారు.

8. ధరణి పోర్టల్ లో పెండింగ్ లోని దరఖాస్తులన్నీ అలాగే ఉంటాయా? మళ్లీ కొత్తగా అప్లై చేయాలా?

ప్రస్తుతం ధరణి పోర్టల్ లో పెండింగులో ఉన్న అప్లికేషన్లు యథాతథంగా భూ భారతిలోకి అప్ లోడ్ అవుతాయి. తిరిగి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే అప్లికేషన్ ఫారం ద్వారా స్టేటస్ ను భూ భారతి పోర్టల్ లో చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మాడ్యూల్స్ ని తగ్గించారు. ధరణిలోని 35 మాడ్యూల్స్ ని ఆరింటికి కుదించడం ద్వారా గందరగోళానికి తెర పడింది. ఎలాంటి సమస్య అనేది అప్లికేషన్ ని బట్టి అధికారులే గుర్తించి పరిష్కరించాలి.

Also Read..

భూ భారతి చట్టంపై అనేక అనుమానాలు.. ఏడాదిలోపే ఎందుకు అప్లై చేయాలంటే..!


Next Story