భూ భారతి చట్టంపై అనేక అనుమానాలు.. ఏడాదిలోపే ఎందుకు అప్లై చేయాలంటే..!

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-22 15:26:09  IST  )

కొత్త భూ భారతి చట్టంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత భూ సమస్యలన్నింటికీ ఇది పరిష్కార మార్గాలను చూపిస్తుందా? సర్వే మ్యాప్ విధానాన్ని కొత్తగా ఎందుకు ప్రవేశపెట్టారు? ఇలాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

భూ భారతి చట్టంపై అనేక అనుమానాలు.. ఏడాదిలోపే ఎందుకు అప్లై చేయాలంటే..!
X

శిరందాస్ ప్రవీణ్​కుమార్

కొత్త భూ భారతి చట్టంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత భూ సమస్యలన్నింటికీ ఇది పరిష్కార మార్గాలను చూపిస్తుందా? సర్వే మ్యాప్ విధానాన్ని కొత్తగా ఎందుకు ప్రవేశపెట్టారు? ఇలాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి రానున్న రోజుల్లో ప్యూరిఫైడ్ ఆర్వోఆర్ ని రూపొందించేందుకు దశల వారీగా వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే భూ భారతి చట్టం కొంచెం డిఫరెంట్ గా ఉంది. మిగతా రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలకు ఇది భిన్నంగా కనిపిస్తున్నది. ఏ రాష్ట్రంలోనూ భూధార్, సర్వే మ్యాపు వంటి సెక్షన్లను జోడించలేదు. అందుకే కొందరు రిటైర్డ్ అధికారులు పెదవి విరుస్తున్నారు. ఇలాంటిది ఎందుకు ప్రవేశపెడుతున్నారు? దీని వల్ల ఉపయోగం ఏమిటి? అంతా గందరగోళంగా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకే భూ భారతి చట్టం అమలు, దాని ద్వారా తలెత్తే సమస్యలు, ప్రయోజనాలపై ‘దిశ’ పాఠకులకు వివరాలను అందిస్తున్నది. భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఏ విధంగా దోహదపడుతుందో దాని రూపకర్త భూమి సునీల్(రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణులు ఎం.సునీల్ కుమార్) తోనే ప్రశ్నలు, వాటికి సమాధానాలను ఇప్పిస్తున్నాం. మరికొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలతో పాటు అపోహలు, వాస్తవాలను కూడా ఈ ఎడిషన్ లో అందిస్తున్నాం. ప్రతి రైతు తనకు ఉన్న సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో ఎవరినీ అడగకుండా ఈ కథనాన్ని చదివితే సరిపోతుంది. ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు దోహదపడేలా ‘దిశ’ వరుస కథనాలు అందిస్తున్నది.

1. లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్లలో సర్వే మ్యాప్ ఉంటుంది?

ప్రతి సేల్ డీడ్ కి సర్వే మ్యాప్ పెట్టాలన్న నిబంధనను చట్టంలో చేర్చారు. ఇది డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ మార్చేందుకు ఉపయోగపడుతుంది. క్రమేణా అన్ని ల్యాండ్ పార్శిళ్లు విస్తీర్ణం, బౌండరీస్ లో ఎలాంటి వివాదాలు లేకుండా మారుతుంది. కర్నాటకలో సక్సెస్ అయ్యింది. తెలంగాణలోనూ ఇది అమలు చేసేందుకు భూ భారతిలో పొందుపరిచాం. ఐతే ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయడం కష్టం. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకం జరగాలి. రెగ్యులర్ సర్వేయర్ల సంఖ్య తక్కువ. వారికే ఈ పనిని అప్పగించడం వల్ల పని భారం పెరుగుతుంది. అలాగే ప్లాట్ రిజిస్ట్రేషన్ కి ఎలాగైతే మ్యాప్ గీస్తున్నారో అలాంటిదే ఇది. ఐతే లైసెన్సుడ్ సర్వేయర్ కొలతలు వేసి బౌండరీస్, అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యాప్ ని ఇస్తారు. దాన్ని రెగ్యులర్ సర్వేయర్ పరిశీలించి ఆమోదిస్తారు. ఐతే త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెడుతున్నది. దీనికి సంబంధించి 2003లోనే లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకం, విధి విధానాలకు సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి కొన్ని మెరుగులు దిద్ది అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఎంపిక తర్వాత సర్వే అకాడమి శిక్షణ ఇస్తుంది. ఇదంతా పూర్తి కావడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. ఆ తర్వాతే ఈ సర్వే మ్యాప్ విధానం అమలవుతుంది.

2. రైతులు సొంతంగా సర్వే చేయించుకోవాలంటే ఎలా అప్లై చేయాలి?

రైతులు సొంతంగా సర్వే చేయించుకోవొచ్చు. సెక్షన్ 5, 7, 8 ప్రకారం మ్యుటేషన్ సందర్భంగా మ్యాప్ కావాలి. మండల సర్వేయర్ సర్వే మ్యాప్ గీసి ఇస్తే దాన్ని పాసు బుక్ లో చేర్చేందుకు సెక్షన్ 10 ప్రకారం తహశీల్దార్ కి అధికారం ఉన్నది. లైసెన్సుడ్ సర్వేయర్ గీసినా దాన్ని మండల సర్వేయర్ పరిశీలించి తహశీల్దార్ కి సమర్పిస్తారు. సర్వేయర్ వాలిడేషన్ తర్వాత తహశీల్దార్ పాసు బుక్ లో జత చేసేందుకు కుదురుతుంది.

3. ప్రస్తుతం చాలా మంది రైతుల పాసు బుక్ లోని సర్వే నంబరుకు, దున్నుకుంటున్న భూమికి మధ్య చాలా తేడా ఉన్నది. ఈ వైవట్ కబ్జా అంశం క్లిష్టంగా మారుతుంది. ఈ దశలో సర్వే మ్యాప్ ఎలా సాధ్యం?

రాష్ట్ర వ్యాప్తంగా రికార్డుకు, పొషిషన్ కి మధ్య చాలా తేడా ఉన్నది. ఇదేం ప్రమాదం కాదు. కలెక్టర్ల సదస్సులోనూ ఈ ప్రస్తావన వచ్చింది. అప్పుడు పాసు బుక్ లోని సర్వే నంబరు కంటే పొషిషన్ ప్రకారం సర్వే చేయడమే కరెక్ట్. అది ఏ నంబరులో ఉన్నా.. రికార్డులోని విస్తీర్ణానికి, పొషిషన్ లో ఉన్న విస్తీర్ణం సరిపోలితే అక్షాంశాలు, రేఖాంశాలతో సరిహద్దులను గీసి సర్వే మ్యాప్ రూపొందించాలి. ఐతే ఇలాంటి మ్యాప్ ని వాలిడేషన్ చేసి పాసు పుస్తకంలో జత చేయడం ద్వారా వివాదాలు తలెత్తవు. ఇలా అమలు చేసేందుకు సీసీఎల్ఏ నుంచి గైడ్ లైన్స్ విడుదల చేస్తే బాగుంటుంది. అలాగే భూ భారతిలో ప్రతి భూ కమతానికి భూధార్ నంబరు ప్రస్తావన ఉన్నది. ఇందులో రెండు రకాలు. ఒకటి తాత్కాలికం, రెండోది పర్మినెంట్. తాత్కాలికమంటే ఇప్పటికిప్పుడు రికార్డును పరిశీలించి భూధార్ నంబరును కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. లేదంటే జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి రైతు దగ్గరున్న రెవెన్యూ రికార్డులను మరోసారి పరిశీలించి ఎలాంటి చిక్కుల్లేకపోతే భూధార్ టెంపరరీ నంబరు ఇవ్వొచ్చు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో సర్వే చేసి కో ఆర్డినేట్ ఫిక్స్ చేసి పూర్తి స్థాయిలో మ్యాప్ తో సహా రూపొందించాలి. అప్పుడు పర్మినెంట్ భూధార్ నంబరును జనరేట్ చేయాలి. ఇది క్రమ పద్ధతిలో చేస్తే ఇప్పుడున్న సర్వే నంబర్లతో పని లేదు. కబ్జాలో ఉన్న విస్తీర్ణం మేరకు కరెక్టుగా ఉంటే సరిపోతుంది.

4. భూ భారతి రూల్స్ పై రెవెన్యూ అధికారులకు, ఉద్యోగులకు అవగాహన కల్పించారా?

ప్రస్తుతం భూ భారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి జిల్లా కలెక్టర్ మండలాల్లో సదస్సులను నిర్వహిస్తున్నారు. వారే స్వయంగా వెళ్లి చట్టంలో ఎలాంటి అంశాలు ఉన్నాయో వివరిస్తున్నారు. ఐతే రూల్స్ గురించి ప్రతి చిన్న విషయం అధికారులకు తెలియాలి. తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లతో పాటు ప్రతి రెవెన్యూ ఉద్యోగికి మార్గదర్శకాల గురించి తెలిసినప్పుడే అమలు చేయడానికి వీలవుతుంది. వాళ్లకు కూడా ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహించాలని సూచించాం.

5. పేద రైతులకు ఉచిత న్యాయం సాయం అందించే వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?

పేదలకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు రెండు మార్గాలను సూచించాం. తాలూకా స్థాయిలో న్యాయ సేవా సంస్థలు, లీగల్ సెల్ అథారిటీస్ పని చేస్తున్నాయి. వాటిల్లో ఆర్డీవో కూడా సభ్యులే. అలాగే జిల్లా స్థాయి లీగల్ సెల్ అథారిటీలో జాయింట్ కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో సెక్రటరీలు ఉంటారు. వీళ్లు తలచుకుంటే సామాన్యులకు ఈ సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందించొచ్చు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పారా లీగల్ వాలంటీర్లు ఉండేవారు. వారిని ఇతర శాఖల్లో పని చేయిస్తున్నారు. వ్యవసాయం, రెవెన్యూ చట్టాలు, పరిపాలన మీద వారికి అనుభవం ఉన్నది. వారందరినీ తిరిగి రెవెన్యూ శాఖలోకి ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా బదిలీ చేయొచ్చు. 135 మందిని జిల్లాల్లోకి పంపొచ్చు. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ఓ సెల్ ఏర్పాటు చేయొచ్చు. రైతుకు సమస్య ఉంటే ఆ సెల్ ని సంప్రదిస్తే ఏ విధంగా చేయొచ్చునో సూచనలు చేస్తారు. ఏమైనా అప్లికేషన్లు పెట్టించాలని ఉన్న సందర్భాల్లో రైతులకు సహకారాన్ని అందించొచ్చు. ఈ ప్రస్తావన గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించాం. త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఉచితంగా పేద గిరిజన, ఆదివాసీలకు న్యాయ సాయం అందించే వ్యవస్థ కోసం ఐటీడీఏ దగ్గర ఫండ్ కూడా ఉంటుంది. సద్వినియోగం చేసుకోవచ్చు.

5. ట్రిబ్యునల్స్ ప్రస్తావన ఉందా? లేదా? ఎప్పుడు, ఏ స్థాయిలో ఏర్పాటు చేస్తారు?

భూ భారతి చట్టంలో ప్రధానంగా చేర్చారు. ఐతే ఏ స్థాయిలో ట్రిబ్యునల్ పెట్టాలన్న పరిశీలన నడుస్తున్నది. ప్రభుత్వం కూడా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఐతే ఎవరిని నియమించాలన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. చట్టం, రూల్స్.. సదస్సులు, అమలు చేసేందుకు సమయం పడుతుంది. అలాగే దరఖాస్తులు, పరిష్కారం, అప్పీల్స్ పూర్తయిన తర్వాతే ట్రిబ్యునల్స్ తో పని ఉంటుంది. ఇప్పుడే భూ భారతి చట్టం అమల్లోకి వస్తుంది. ట్రిబ్యునల్స్ తో పనికి కాస్త టైం పడుతుంది. ఈ లోగా జూన్ 2 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. అప్పుడు ప్రతి గ్రామం నుంచి భూ సమస్యల పరిష్కారానికి అప్లికేషన్లు వస్తాయి. వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. ఐతే ఏయే జిల్లాలో ఏ స్థాయిలో భూ సమస్యలు ఉన్నాయో ఓ అంచనా దొరుకుతుంది. అప్పుడు ఉమ్మడి జిల్లా స్థాయిలో పెట్టాలా? నాలుగు ప్రాంతాలు విభజించి ఏర్పాటు చేయాలా? ప్రతి జిల్లాకు అవసరమా? అన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుంది. ఇదంతా జరగడానికి కనీసం ఆరు నెలలు పట్టొచ్చు. కానీ ట్రిబ్యునల్స్ పెట్టడం మాత్రం పక్కా.

6. రూల్ 4(1) ప్రకారం భూమి వివరాలు తప్పుగా నమోదైతే సంవత్సరం లోపు దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది?

భూ భారతిలో ఈ అంశాన్ని చేర్చడం పట్ల పలువురి నుంచి విమర్శలొస్తున్నాయి. నిజమే.. ఐతే ప్రతి ఆర్వోఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ప్యూరిఫైడ్ ఆర్వోఆర్ రికార్డును రూపొందించుకోవాలి. ఆర్వోఆర్ 2020 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ పని చేయలేదు. ఇప్పటికే ఐదేండ్లు గడిచింది. ఇంకా అనేక భూ సమస్యలు ఉన్నాయి. ఐతే ప్రతి రైతు తన రికార్డును చూసి సరిగ్గా ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వెరిఫై చేసుకోవాలి. ఏదో ఒక రోజు సరి చేయించుకోవాల్సిందే కదా. అందుకే రికార్డును ఆర్వోఆర్ 1948, ఆర్వోఆర్ 1971 అమలు చేసినప్పుడు ప్రతి గ్రామానికి ప్యూరిఫైడ్ రికార్డును రూపొందించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పుడూ అదే జరగాలి. ఐతే ఏడాది నిబంధన పెట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత కూడా అప్లికేషన్ పెట్టుకుంటే పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియనే. ప్రతి ఒక్కరూ నెగిటివ్ కోణంలో కాకుండా ప్యూరిఫైడ్ రికార్డును తయారు చేయడానికి సహకరించాలి. ఈ రికార్డు ప్యూరిఫై చేస్తే పర్మినెంట్ భూధార్ నంబర్ పొందొచ్చు. ఒక్కసారి డిస్ప్యూట్ ఫ్రీగా ల్యాండ్ మారితే దాని విలువ ఏ స్థాయిలో పెరుగుతుందో కూడా అంచనా వేయాలి.

7. పీవోబీ నుంచి తొలగించాలంటూ దాఖలైన దరఖాస్తులను మూడు, నాలుగు సార్లు అకారణంగా రిజెక్ట్ చేశారు. వారు మళ్లీ అప్లై చేసుకోవాలా?

అవసరం లేదు. ఇప్పటికే ధరణి పోర్టల్ లో పెండింగులో ఉన్న అన్ని అప్లికేషన్లను భూ భారతి పోర్టల్ లో కనిపిస్తాయి. అదే అప్లికేషన్ నంబరు ద్వారా స్టేటస్ ని తెలుసుకోవచ్చు.

8. ఒక సర్వే నంబరులో 100 ఎకరాలు ఉంటే అందులో కొంత భాగమే ప్రభుత్వానిది. కానీ పూర్తి విస్తీర్ణాన్ని పీవోబీలో నమోదు చేశారు. దాంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. అప్లై చేస్తే ఖాస్రా, సేత్వార్ అంటున్నారు. సుమోటోగా ఎందుకు పరిష్కరించకూడదా?

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. నిజానికి ల్యాండ్ క్లాసిఫికేషన్ నిర్ణయించడానికి సేత్వార్, ఖాస్రా పహానీ మాత్రమే ప్రామాణికం కాదని సుప్రీం కోర్టు కూడా అనేకమార్లు తీర్పులు చెప్పింది. కానీ ఇప్పటికే అదే ప్రామాణికమంటూ నిషేదిత జాబితాలో నమోదు చేశారు. ఆ తర్వాత పహానీలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్న తీర్పులను అధికారులు పట్టించుకోవడం లేదు. ఐతే గతంలో పని చేసిన అధికారులు సూచించిన మార్గాన్నే ఇప్పటికీ అధికారులు పాటిస్తున్నారు. కానీ ఆ తర్వాత పట్టాగా మారి అనేక క్రయ విక్రయాలు చోటు చేసుకున్నాయి. వీటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. కనీసం 30 ఏండ్ల పాటు పట్టాగా ఉంటే దాన్ని పట్టాగా చూడాల్సిందే. ఎందుకంటే లీగల్ గా సేల్ డీడ్ చేసుకున్నారు. ఆ డీడ్ ఎందుకు చేశారన్న ప్రశ్న తలెత్తుతుంది. అలాగే 50, 60 ఏండ్ల నుంచి అది పట్టాగా ఉంటూ చేతులు మారింది. ఇప్పటికీ సేత్వార్ ప్రకారం ప్రభుత్వానిదిగా రికార్డు మార్చగలరు. కానీ రైతుల నుంచి లాక్కోలేరు. వివాదం అలాగే కొనసాగుతుంది. ఇప్పటికైనా న్యాయస్థానాల ఆదేశాల మేరకు సీసీఎల్ఏ నుంచి సర్క్యులర్ జారీ కావాలి. వీటిపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సీసీఎల్ఏదే. ఏదేమైనా సేత్వార్ లో ప్రభుత్వం అని, ఖారీజ్ ఖాతా అని ఉంది గనుక.. దాన్ని పీఓబీ నుంచి తొలగించమనే అధికారుల విధానం తప్పు. ఆ తర్వాత పహానీలను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ఆర్వోఆర్ 1971 ప్రకారం 1989 నుంచి 1996 వరకు ప్రతి గ్రామంలో ఆర్వోఆర్ రికార్డు రూపొందించారు. దానికి గెజిట్ విడుదల చేశారు. అదైనా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పీవోబీ సమస్యలు సగానికి పైగా పరిష్కారమవుతాయి.

9. 40, 50 ఏండ్ల క్రితం ఎప్పుడో ఓ సారి పన్ను కట్టకపోతే ఖారీజ్ ఖాతాగా నమోదై భూములను ప్రభుత్వానివిగా నమోదు చేశారు. ఆ తర్వాత పట్టాగా రాశారు. ఎన్నో లావాదేవీలు చోటు చేసుకున్నాయి. వాటిని క్లాసిఫికేషన్ చేంజ్ చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో దరఖాస్తులు రిజెక్ట్ చేస్తున్నారు.

ఖారీజ్ ఖాతా అంటే డెఫినేషన్ తెలియకపోవడమే పెద్ద కారణం. ఏదో ఒక ఏడాది సదరు రైతు పన్ను కట్టకపోతే ఖారీజ్ ఖాతా అని నమోదు చేసి ఉంటారు. ఆ మరుసటి సంవత్సరం పన్ను చెల్లించినప్పుడు తిరిగి పట్టాగా పహానీలో నమోదు చేస్తారు. ఇక అప్పటి నుంచి అది పట్టాగా కొనసాగుతుంది. 50, 60 ఏండ్లుగా క్రయ విక్రయాలు, సక్సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఖారీజ్ ఖాతా అంటూ నిషేదిత జాబితాలో నమోదు చేయడం సరైంది కాదు. దీనిపై సీసీఎల్ఏ నుంచి నిర్దిష్టంగా ఆదేశాలు అందాలి. ప్రతి అధికారికి ఇలాంటి వాటిని అన్ని పహానీలు చూసి నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి.

10. భూధార్ నంబరు ఎప్పటి నుంచి ఇస్తారు? ఇచ్చేటప్పుడు రైతులు ఏం చేయాలి?

ప్రతి కమతానికి భూధార్ నంబరు ఇవ్వాలని భూ భారతిలో చేర్చాం. ఇది ఎందుకో తెలుసుకోకుండా కొందరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇది రెండు రకాలు. ఒకటేమో టెంపరరీ, రెండోది పర్మినెంట్ నంబర్. అన్ని రికార్డులు వెరిఫై చేసి, కరెక్టుగా ఉంటే ఇచ్చేది టెంపరరీ. ఈ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల భూ సమస్యలు తీరుతాయి. అలాగే రికార్డుకు, గ్రౌండ్ కి మధ్య తేడాలు తగ్గుతాయి. ఇప్పుడు ఆ ల్యాండ్ పార్శిల్ ని సర్వే చేస్తారు. అక్షాంశాలు, రేఖాంశాలతో సర్వే మ్యాప్ గీస్తారు. ఆ మ్యాప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కో ఆర్డినేట్స్ తో కూడిన భూధార్ నంబరు జారీ అవుతుంది. ఈ నంబరు టైప్ చేయగానే ఒక మనిషి ఆధార్ నంబరు ద్వారా ఎలాంటి వివరాలన్నీ తెలుస్తాయో, దీని వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. విస్తీర్ణం, పట్టాదారుడు, హద్దులు, ఆ ల్యాండ్ హిస్టరీ అంతా అందులోనే ఉంటుంది. ఇక లింక్ డాక్యుమెంట్ల ప్రస్తావన కూడా రాదు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆ ల్యాండ్ పార్శిల్ కి పూర్తి రైట్స్ వస్తాయి. ఎలాంటి చిక్కులు ఉండదు. ఈ క్రమంలో ఆ రైతు భూమికి ఎంత విలువ పెరుగుతుందో అర్ధం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం స్వమిత్వ పేరిట ఇండ్లు, ఇంటి స్థలాలకు ఇదే చేస్తుంది. స్వమిత్వ కార్డులు తీసుకెళ్తే బ్యాంకులు లోన్లు ఇచ్చే స్థాయిలో ఉంటాయి. ఇక్కడ కూడా దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ భూమికి భూధార్ నంబరు ఇస్తే ల్యాండ్ విలువ ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. ఇప్పుడిచ్చే రూ.లక్ష, రెండు లక్షలు కాదు.. పెద్ద మొత్తంలో రుణాలు రైతులు పొందే వీలుంటుంది. భూమి నిరార్ధక ఆస్తి కాదు. దాని నుంచి సంపద సృష్టించాలన్నదే కాన్సెప్ట్. ఇది అర్ధం చేసుకోకుండా భూధార్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు.

11. భూ భారతిలో వివరాలు తాత్కాలికమా? ఎందుకు?

ధరణి పోర్టల్ లో ఉన్న డేటా తాత్కాలికమే. అవును.. కొత్త పోర్టల్ లో ప్యూరిఫైడ్ డేటాను అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐతే ధరణి పోర్టల్ ని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు కొన్ని నెలల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. దాంతో అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆరు నెలల పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి డేటాను ప్యూరిఫై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టులు, జిల్లాకో మండలంలో పైలెట్.. ఆ తర్వాత జూన్ 2 నుంచి ఆగస్టు 15 వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ఉంటాయి. ప్రతి ఊరిలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. దీని ద్వారా రికార్డు సరిగ్గా అవుతుంది. అప్పుడు కొత్త పోర్టల్ లోకి మారుతుంది. ఇప్పుడు రైతులకు ఇబ్బంది కలగకుండానే ఈ ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న సదుద్దేశ్యమే.

12. అప్పీల్ టైం లిమిట్ లో జరగాలంటున్నారు. కానీ అధికారులు కూడా నిర్దిష్ట సమయంలో పని చేయాలి కదా? వారిని శిక్షించరా?

ఇప్పుడే భూ భారతి చట్టం అమలవుతుంది. ఇంకా రైలు స్టార్ట్ కాలేదు. ఓ సారి స్పీడ్ అందుకున్న తర్వాత ప్రతి పనికి టైం లిమిట్ పెట్టుకోవాల్సిందే. సిటిజన్ సర్వీసెస్ గ్యారంటీ చట్టం వంటివి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

అపోహలు.. అనుమానాలు

‌‌= భూ భారతి రాగానే మళ్లీ పాసు పుస్తకాల కోసం అప్లై చేయాలా? నా దగ్గర ధరణి పాసు బుక్ ఉంది కదా.. అవును మళ్లీ అప్లై చేయాల్సిన అవసరమే లేదు.

= దరఖాస్తు పెండింగులో ఉంటే మళ్లీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

= సాదాబైనామా దరఖాస్తులు కొత్తగా పెట్టుకోవచ్చా? లేదు. మరో అవకాశం లేదు. గతంలో పెండింగులో ఉన్న 9 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే జరుగుతుంది. ఇక నుంచి తెల్ల కాగితాల మీద కొనుగోళ్లు, అమ్మకాలు చెల్లవు.

= సర్వే మ్యాప్ వెంటనే అమలవుతుందా? లేదు సర్వేయర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాతే.. ఓ తేదీని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అప్పటి నుంచి సర్వే మ్యాప్ అవసరం ఏర్పడుతుంది.

= లైసెన్సుడ్ సర్వేయర్ మ్యాప్ గీస్తే చెల్లుతుందా? చెల్లుతుంది. దాన్ని మండల సర్వేయర్ వాలిడేషన్ చేసి సంతకం చేస్తారు. ఆ తర్వాత తహశీల్దార్ దాన్ని పట్టాదారు పాసు పుస్తకంలో అతికిస్తారు.

= భూధార్ నంబరు ఎప్పుడు ఇస్తారు? రికార్డుల పరిశీలన తర్వాతే మొదలు అవుతుంది. ఇంకా మొదలు కాలేదు.


Also Read..

TG: భూ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఎవరు చేస్తారు?.. అన్నింటికీ పరిష్కార మార్గం

Next Story