- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎస్ లేకపోతే అరవింద్ బతుకు ఎక్కడ? అద్దంకి దయాకర్ కౌంటర్
బీఆర్ఎస్ నాయకులు అబద్దాన్ని పదే పదే చెప్పి నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి తప్పులు చేస్తే ప్రజలు తిరగబడతారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నాయకులు అబద్దాన్ని పదే పదే చెప్పి నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి తప్పులు చేస్తే ప్రజలు తిరగబడతారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొడంగల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వడ్ల కొనుగోళ్ల పైన తప్పుడు ప్రచారం చేశారని, ధాన్యం కొనుగోళ్ల పైన ప్రభుత్వం నుంచి అధికారికంగా తీసుకుని మాట్లాడాలని, కావాలంటే సమాచార హక్కు చట్టం కింద లెక్కలు తీసుకోవచ్చన్నారు. సబితా ఇంద్రారెడ్డికి ఏ రైతులు ఫిర్యాదు చేశారో చెప్పాలని, ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరన్నారు. బీఆర్ఎస్ వాళ్లు రాసింది చూసి చదవితే సబితా ఇంద్రారెడ్డి ప్రజల్లో చులుకన అవుతారని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రూ. 6,462 కోట్లను రైతు ఖాతాల్లో వేశామన్నారు. వికారాబాద్ జిల్లాలో మే రెండో వారంలో వరి కోతలు మొదలయ్యాయని, 3608 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 15,186 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 21.43 కోట్లను జమ చేశారని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలు
రైస్ మిల్లర్ల పైన ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. గన్నీ బ్యాగ్ లకు ఎక్కడా రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం లేదని, బీఆర్ఎస్ హయాంలో తరుగు పేరుతో రైతులను మోసం చేశారని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్‌లో వరి వేసి రైతులను మాత్రం వరి వేయకూడదన్నారు. 2025-26 రబీ ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయని, మే 18, 2026 నాటికి రాష్ట్రంలో 40.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.6,462.73 కోట్లు చెల్లింపులు జరిగాయని రామ్మోహన్ రెడ్డి చెప్పారు.
ఆ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకే పదవులు : అద్దంకి
సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడానికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రధాని మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారని కూడా తప్పు పడుతున్నారని, కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఎలా వచ్చారు, ఎలా అధికారంలోకి తెచ్చాడన్నది దేశానికి, మోడీకి కూడా తెలుసని శాసన మండలి ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అన్ని చోట్ల ఒరిజినల్ బీజేపీ వాళ్లకే పదవులు ఇచ్చిందా? పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, అస్సాం సీఎం హేమంత బిశ్వా ఏ పార్టీ నుంచి వచ్చారు? అరవింద్ పనికిరాని మాటలు బంద్ చేయాలన్నారు. తాను ఒరిజినల్ బీజేపీ నాయకుడినని అరవింద్ చెప్పుకుంటున్నారని, డీఎస్ లేకపోతే మీ బతుకు ఎక్కడ అని అద్దంకి దయాకర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి మాలాంటి వాళ్లను ఆహ్వానించామని, అరవింద్ లాంటి వాళ్లను బీజేపీ ఎప్పటికీ పట్టించుకోదని, ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకే పదవులు ఇస్తారని ఆయన తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో ఓటమిని అర్వింద్ ఓర్చులేకపోతున్నారని, ప్రభుత్వం పైన విమర్శలు చేయవచ్చని, కానీ, ఇష్టారీతిన మాట్లాడటం తగదన్నారు. ప్రధాని మోడీ, రేవంత్ రెడ్డి మధ్య సంభాషణ రహస్యంగా జరగలేదని, మాతో కలువు అని మోడీ అన్నది అభివృద్ధి విషయంలోనే, మోడీ మాతో కలిసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి వస్తారా? అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.






