- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విలీనం ఎక్కడ..? ప్రమోషన్లు ఎక్కడ..? మూడు నెలలైనా ముందుకు కదలని ఉద్యోగుల విలీనం
జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేయడంతో సంబంధిత ఉద్యోగులను కలపాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్ తప్ప మిగిలిన ఉద్యోగులను విలీనం చేయాల్సిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేయడంతో సంబంధిత ఉద్యోగులను కలపాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్ తప్ప మిగిలిన ఉద్యోగులను విలీనం చేయాల్సిందే. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 51 గ్రామాలకు సంబంధించి సుమారు 3 వేలకుపైగా రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారని అధికారుల అంచనా. అయితే మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి మూడు నెలలు గడుస్తున్నా ఉద్యోగులను మాత్రం ఇంత వరకు విలీనం చేయలేదు. జీహెచ్ఎంసీ ప్రమోషన్లలో వీరికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం సీడీఎంఏ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. సాధారణ బదిలీల్లో కూడా వీరికి అవకాశమివ్వాలని మున్సిపల్ శాఖ నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా విభాగానికి చెందిన ఆస్తులు, ఉద్యోగులను జలమండలికి అప్పగించలేదు.
3 వేల మంది ఉద్యోగులు
27 పట్టణ స్థానిక సంస్థల్లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసిన 51 గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కలిపి 3 వేల మంది ఉంటారు. 27 మున్సిపాలిటీల్లో అయితే పబ్లిక్ హెల్త్ వర్కర్, శానిటేషన్ వర్కర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, మున్సిపల్ కార్పొరేషన్‌లో అయితే శానిటరీ సూపర్‌వైజర్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ ఉంటారు. ఇంజినీరింగ్ విభాగంలో మున్సిపాలిటీకి అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)తోపాటు వర్క్ ఇన్‌స్సెక్టర్ ఉంటారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్‌లో అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ), పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌లో అయితే సూపరిటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) ఉంటారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో టీపీఎస్, ఫీల్డ్ లెవల్‌లో చైన్‌మన్ ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్ అయితే అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) ఉంటారు. పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌లో అయితే సిటీ ప్లానర్ (సీపీ) స్థాయి అధికారి ఉంటారు. రెవెన్యూ విభాగంలో బిల్ కలెక్టర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మేనేజర్, రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. మెప్మాలో రీసోర్స్ పర్సన్, కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉంటారు. అన్ని విభాగాలను పర్యవేక్షించడానికి పరిపాలనాధికారిగా మున్సిపల్ కమిషనర్ ఉంటారు. వీరిని మున్సిపాలిటీ గ్రేడ్ ఆధారంగా నియమిస్తున్నారు.
ఆ పోస్టుల్లో వ్యత్యాసం
జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలకు చెందిన ఉద్యోగులకు సంబంధించి కొన్ని పోస్టుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్, బిల్ కలెక్టర్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ వరకు రెండింటిలో ఒకేలా ఉంటారు. అయితే జీహెచ్ఎంసీలో సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ పొందాల్సి ఉంటుంది. కానీ మున్సిపాలిటీల్లో సీనియర్ అసిస్టెంట్ నుంచి మేనేజర్-3, మేనేజర్-2, మేనేజర్-1 ప్రమోషన్ పొందాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీలో అయితే సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ).. ఇక్కడి నుంచి గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా ప్రమోషన్ వస్తుంది. మున్సిపాలిటీల్లో మేనేజర్-1 నుంచి గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్‌గా ప్రమోషన్ పొందాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ నుంచి అయితే గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్‌గా ప్రమోషన్ పొందాల్సి వస్తుంది.
1000 మందికి పైగా..
జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీలకు చెందిన రెగ్యులర్ ఉద్యోగులు సుమారు 1000కిపైగా ఉంటారు. వీరిని జీహెచ్ఎంసీలో విలీనం చేసుకుని ప్రమోషన్లు, పోస్టింగుల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ విలీనం చేసుకోకపోవడంతో ప్రమోషన్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ బదిలీల్లో వీరికి అవకాశమివ్వాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది.
తాగునీటి సరఫరా ఉద్యోగులు
క్యూర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ జలమండలి చూడాల్సి ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా చేస్తున్న ఉద్యోగులను ఇంతవరకు జలమండలిలో విలీనం చేయలేదు. దీంతోపాటు నీటి సరఫరా ఉద్యోగులంతా సీడీఎంఏ పరిధిలోనే కొనసాగుతున్నారు. పైగా మున్సిపాలిటీలకు చెందిన ఆస్తులను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ తాగునీటి సరఫరాకు చెందిన రిజర్వాయర్లు, ట్యాకులు, ఇతర ఆస్తులను జలమండలికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు జరగలేదు. ఫలితంగా క్యూర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జలమండలి తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ చేయలేకపోతుందనే అధికారులు చెబుతున్నారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించి తమకు ప్రమోషన్లతోపాటు బదిలీల్లో న్యాయం చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.






