ఆ 38 మంది మావోయిస్టుల ఆచూకీ ఎక్కడ?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-08 03:07:57  IST  )

మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి నిఘా వర్గాలు రూపొందించిన తాజా నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.

ఆ 38 మంది మావోయిస్టుల ఆచూకీ ఎక్కడ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి నిఘా వర్గాలు రూపొందించిన తాజా నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కేడర్‌లో మొత్తం 55 మంది ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టుల లొంగుబాటు సమయంలో పలుమార్లు మీడియాకు నివేదికలు అందజేశారు. జనవరి 3న పీఎల్‌జీఏ వన్ బెటాలియాన్ కమాండర్ బార్సె దేవా లొంగుబాటు కార్యక్రమంలో కేవలం 17 మంది మాత్రమే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. మిగిలిన 38 మంది ఆచూకీ తెలియరాలేదని వెల్లడైంది. ఉద్యమంలో చేరాక వివిధ కారణాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన 38 మంది మావోయిస్టు సభ్యులు.. ఇప్పుడు ఎక్కడున్నారనే అంశంపై క్లారిటీ లేకపోవడం భద్రతా వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క తెలంగాణ నుంచే ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టుల కేడర్ జాడ తెలియకపోవడం అరుదైన పరిణామం అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉద్యమానికి దూరమై సాధారణ జీవితం?

మావోయిస్టు సభ్యులు ఎవరైనా ఎదురుకాల్పుల్లో మరణించినా, అనారోగ్యంతో చనిపోయినా, పార్టీ తరఫున కుటుంబాలకు సమాచారం అందించడం ఆనవాయితీగా వస్తోంది. అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి, వీడియోలు తీసి కుటుంబాలకు పంపిన సందర్భాలూ గతంలో చాలానే ఉన్నాయి. కానీ, ప్రస్తుతం కనిపించకుండా పోయిన ఆ 38 మంది సభ్యుల విషయంలో అలాంటి సమాచారం ఏదీ ఇప్పటివరకు కుటుంబ సభ్యులకు చేరలేదు. వీరు పార్టీలో కొనసాగుతూ మరణించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారుల అంచనా ప్రకారం.. అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే ఈ కేడర్ ఉద్యమానికి పూర్తిగా దూరమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు గుర్తింపులు మార్చుకొని ఎక్కడో సాధారణ జీవితం గడుపుతూ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. నిఘా తీవ్రత తక్కువగా ఉన్న కాలంలో కొందరు విదేశాలకు వెళ్లిపోయి ఉండవచ్చన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అనుమానాలకు బలాన్నిచ్చే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం బీర్పూర్‌కు చెందిన బల్మూరి నారాయణరావు కేసును నిఘావర్గాలు ప్రస్తావిస్తున్నాయి. 1980లో పీపుల్స్ వార్‌లో చేరిన ఆయన, దీర్ఘకాలంగా ఉద్యమానికి దూరంగా ఉండి సాధారణ జీవితం గడుపుతున్నట్లు రాష్ట్ర నిఘా వర్గాల విచారణలో తేలింది. 2024 డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లా అంతఘర్ ప్రాంతంలో ఆయన అరెస్టయ్యారు. ఇదే తరహాలో మిగిలిన ఆ 38 మంది కూడా ఎక్కడో సామాన్య జీవితం కొనసాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నేటికీ క్రియాశీలంగా 17 మంది

గణపతి, దేవ్ జీ, సంగ్రాం, పసునూరి నరహరి, బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడె రత్నాబాయి, నక్క సుశీల, లోకేటి చందర్ రావు, జాడి పుష్ప, రంగబోయిన భాగ్య, బడిశ ఉంగా, మాడ్వి అడుమే, కాశపోగు భవాని, కుంజం ఇడ్మల్, ఉతిమి అనిల్ కుమార్‌లు ఇప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉన్నట్లు రాష్ట్ర నిఘావర్గాలు గుర్తించాయి.

వారంతా ఎటుపోయినట్టు?

ఒకేసారి పదుల సంఖ్యలో మావోయిస్టుల వివరాలు తెలియలేదని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పడం చర్చనీయాంశమైంది. గడిచిన 2 నెలల కాలంలో 3 సార్లు లొంగుబాటు కార్యక్రమాలు జరిగాయి. ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు లొంగిపోయారు. ఆ టైంలోనూ మావోయిస్టులు ఎంత మంది ఉన్నారనే వివరాలను సీసీఎం, ఎస్‌సీఎం వివరాలతో మీడియాకు చెబుతున్నారు. నవంబర్ 22న 59 మంది, డిసెంబర్ 19న 54 మంది ఉన్నారని తెలిపారు. కానీ, పీఎల్‌జీఏ వన్ బెటాలియన్ కమాండర్ దేవా లొంగుబాటు కార్యక్రమంలో కేవలం 17 మంది మాత్రమే ఉన్నారన్న విషయం బహిర్గతమైంది. ఈ విషయంలో పోలీసు నిఘా వర్గాల తీరు విస్మయం కలిగిస్తున్నది. పోలీసులు తెలిపిన వివరాలపై సీపీఐ మావోయిస్ట్ పార్టీ సైతం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.






Next Story