ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో రెగ్యూలర్ వీసీ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పాలన

by Malleboina Mahesh |

యువతకు సృజనాత్మక నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని, కళాత్మక దృక్పథాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోన్న జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) గత కొద్ది రోజులుగా పలు వివాదాలకు నిలయంగా మారుతోంది.

ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో రెగ్యూలర్ వీసీ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పాలన
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువతకు సృజనాత్మక నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని, కళాత్మక దృక్పథాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోన్న జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) గత కొద్ది రోజులుగా పలు వివాదాలకు నిలయంగా మారుతోంది. కళలు, వాస్తు విద్యకు గొప్ప నిలయమని భావించే యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో వీసీ లేకపోవడం వల్ల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పాలనా అంశాల్లో సైతం తమ పరిధిలో లేని విషయాల్లో సైతం ఇంచార్జి వీసీ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. సీఎంకి ఇష్టమైన ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో పాలనాపరమైన నిర్ణయాలను ప్రశ్నించే వారులేక అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. యూనివర్సిటీలో నాన్ టీచింగ్ సిబ్బందిలో 75 ఏళ్ల వ్యక్తిని ఇంచార్జ్ వీసీ అండదండలతో ఇంకా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎన్నారై సీట్ల కేటాయింపులో అక్రమాలు

లోకల్ అభ్యర్థులకు కేటాయించాల్సిన సీట్లను అక్రమంగా ఎన్నారై విద్యార్థులకు కేటాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిబంధనల ఉల్లంఘనపై అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఇది ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అతిపెద్ద తప్పిదమని పలువురు ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తంగా ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో వీసీ నియామకంతో పాటు సమగ్ర విచారణ, ప్రక్షాళన అవసరమని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సర్టిఫికెట్ల వివాదాలకు కేరాఫ్ అడ్రస్..

విజన్-2047 లో భాగంగా సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని, పరిశోధనలను ప్రోత్సహించాలని, ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా ఎదగాలని జేఎన్ఏఎఫ్ఏయూ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ రంగాలలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇంచార్జీ వీసీ వ్యవహారాలతో ప్రతిష్టను కోల్పోయే ప్రమాదముందని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో యూనివర్సిటీ పలు సర్టిఫికెట్ల వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. కొందరు ఉన్నతాధికారులు యూనివర్సిటీలో యూజీ (డిగ్రీ), పీజీ (పీజీ) కోర్సులను కేవలం సంవత్సరం వ్యవధిలోనే పూర్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హత లేని వారికి, నిబంధనలు ఉల్లంఘించి పదోన్నతులు కల్పించాలనే లక్ష్యంతో ఇంచార్జీ వీసీ ముందుకెళుతున్నారనే వాదన వినిపిస్తోంది. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరుపుతున్నామని చెబుతున్న అధికారులు, గత మూడు నెలలుగా కేవలం స్క్రూట్నీ పేరుతో కాలయాపన చేస్తున్నారని సీనియర్ ప్రొఫెసర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇంచార్జ్ లతోనే పాలన..

యూనివర్సిటీ లో పూర్తిస్థాయి వీసీని నియమించడంలో విద్యాశాఖ గత కొంతకాలంగా అలసత్వం వహిస్తోంది. దీని కారణంగా, ఇంచార్జీ వీసీ తోనే పరిపాలన సాగుతోంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని, పాలనాపరమైన, అకడమిక్ నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి అధిపతి లేకపోవడం వల్లే యూనివర్సిటీలో పలు అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోందని వారు అంటున్నారు.

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం..

యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా కెరీర్ అడ్వాన్స్‌ మెంట్ స్కీమ్ ను అమలు చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతుందనే వాదన ఉంది. ఇంచార్జ్ వీసీ స్వార్థ ప్రయోజనాల కోసం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, యూజీసీ నిబంధనల ప్రకారం.. యూజీ డిగ్రీకి, పీజీ డిగ్రీకి మధ్య కనీసం రెండేళ్ల వ్యవధి ఉండాలి. కానీ, ప్రస్తుతం సీఏఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక సంవత్సరమే వ్యవధి ఉన్నవారు కూడా ఉండడం నిబంధనలకు విరుద్ధం. పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలను ఆశించే ఇంచార్జ్ వీసీ ఈ సీఏఎస్ ప్రక్రియను నిర్వహిస్తున్నారని విద్యార్థుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సీఏఎస్ ప్రక్రియను నిలిపివేయాలని, వీలైనంత త్వరగా యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

సీఏఎస్ అమలుతో ప్రభుత్వ ఖజానాకు గండి ..

యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్దంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శికి, సాంకేతిక విద్యా కమిషన్, తెలంగాణ ఉన్నత విద్యామండలికి గతంలోనే భారీ ఎత్తున ఫిర్యాదులు అందాయి. జేఎన్ఏఎఫ్ యూ ఇన్‌ఛార్జ్ వీసీ అక్రమ పద్ధతుల్లో పదోన్నతులను కల్పిస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. నకిలీ పత్రాలతో పదోన్నతులు కల్పిస్తూ, అర్హత లేని వారికి కూడా కెరీర్ అడ్వాన్స్‌ మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద లబ్ధి చేకూరుస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Next Story