BC bill: ఎస్సీ వర్గీకరణకు ఓకే.. బీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం ఎప్పుడు?

by Prasad Jukanti |

బీసీ రిజర్వేషన్ల కల్పించే బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది.

BC bill: ఎస్సీ వర్గీకరణకు ఓకే.. బీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం ఎప్పుడు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి, రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బీసీ బిల్లు (BC Bill) గవర్నర్ (Governor) ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. గత నెల 17న శాసనసభ, 18న శాసనమండలి ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ఈ ఏడాది ప్రారంభంలో కులగణన నిర్వహించిన తర్వాత ఈ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అదే సమయంలో మార్చి 18వ తేదీన ఉభయ సభలు ఆమోదించిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును (SC Classification Bill) రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపించగా ఈ బిల్లును ఆమోదించిన జిష్ణు దేవ్ వర్మ (Jishnudev Verma).. బీసీ బిల్లుపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బీసీ బిల్లుతో ముడిపడిన 'స్థానిక' ఎన్నికలు:

బీసీ బిల్లుకు గవర్నర్ అప్రూవల్ ఇస్తే వాటి ప్రకారం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 29 శాతం నుండి 42 శాతానికి పెంచితే మొత్తం రిజర్వేషన్ కోటా సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితిని మించిపోతుంది. దీంతో బిల్లు చుట్టు ఉన్న చట్టపరమైన చిక్కులను రాజ్ భవన్ సమీక్షిస్తున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభుత్వం పంపించే బిల్లులపై గవర్నర్ మూడు నెలల్లో తన నిర్ణయాన్ని తెలపాలని గడునును ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. ఇంకో వైపు ఈ బీసీల రిజర్వేషన్ కోటా విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ బిల్లు విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఒక వేళ గవర్నర్ ఆమోదం ఆలస్యం అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సైతం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Next Story