ఫీజుల నియంత్రణ బిల్లు ఎప్పుడు? ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై కవిత డిమాండ్

by Ramesh Naini |

కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

ఫీజుల నియంత్రణ బిల్లు ఎప్పుడు? ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై కవిత డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఆగం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల మీద ఈ ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకుని నిలదీశారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ మహిళా బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించినప్పుడు లక్షలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. దీనిపై తెలంగాణ విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు సిద్ధం చేసి నెలలు గడుస్తున్నా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ పై ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పేదలు, మధ్య తరగతి ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కచ్చితంగా వారిని మోసం చేయడమేనని అన్నారు. సామాన్య ప్రజలు ఫీజులు చెల్లించలేక ఆగమవుతుంటే ప్రభుత్వం మాత్రం ఈ బిల్లును అటకెక్కించిందని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థల లాబీతో ప్రభుత్వానికి లాలూచీ ఏంటని ప్రశ్నించారు. వారితో ఏదైనా ఒప్పందాలు ఉన్నాయా? లేదంటే రహస్య ఎజెండా ఉందా చెప్పాలని నిలదీశారు. ఫీజుల దోపిడీ కారణంగా సామాన్య కుటుంబాల జీవితకాలపు పొదుపు హారతి కర్పూరంలా కరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశం

సింగరేణి సంస్థను కాపాడేందుకు ఆదివారం సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణ, సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు, అలియాస్ పేర్ల అంశం, కారుణ్య నియమాకాలు, సంస్థ మనుగడ కోసం చేపట్టాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Next Story