T BJP: తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి చిచ్చు.. రాజాసింగ్ బాటలో మరికొంత మంది?

by Prasad Jukanti |   (  Updated:2025-06-30 12:26:01  IST  )

తెలంగాణ బీజేపీలో తాజా పరిణామాలు మోడీ, అమిత్ షాకు తలనొప్పిగా మారాయా?

T BJP: తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి చిచ్చు.. రాజాసింగ్  బాటలో మరికొంత మంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో (Telangana BJP) అధ్యక్ష పదవి చిచ్చు రాజేసింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుకు (Ramachandar Rao) రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న అధిష్టానం నిర్ణయానికి నిరసనగా సొంత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి గుడ్ బై (Rajasingh Resignation) చెప్పారు. దీంతో ఈ వ్యవహారం కమలం పార్టీలో కల్లోలానికి దారి తీసింది. పార్టీలో కష్టపడే వారికి న్యాయం జరగడం లేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కొంత మంది బీజేపీ నేతలకే ఇష్టం లేదంటూ రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను రాయడం కాషాయ శిబిరంలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం పప్పులో కాలేసిందా? అందరినీ సంతృప్తి పరిచేలా అందరిని ఒప్పించాకే అధిష్టానం నిర్ణయం ఉంటుందని అంతా భావించినా తాజా పరిమాలు అందుకు భిన్నంగా ఉండటం హాట్ టాపిక్ గా మారుతోంది.

రాజాసింగ్ దారెటు?:

రాజాసింగ్ రాజీనామా విషయంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు నడిపించే రాజాసింగ్ కు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నాయని సరిగ్గా ప్రణాళికలు వేసుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అనే చర్చ ఆ పార్టీలో మెజార్టీల అభిప్రాయాం. ఇటువంటి సమయంలో రాజాసింగ్ వంటి హార్డ్ కోర్ హిందుత్వా లీడర్ బీజేపీని వీడటం దుమారంగా మారింది. అయితే రాజాసింగ్ నిర్ణయం పట్ల బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలోని మెజార్టీ కార్యకర్తల అసంతృప్తినే రాజాసింగ్ చెప్పారని కొందరు చెబుతుంటే మరికొందరు మాత్రం రాజాసింగ్ ను ఇంకెంత కాలం భరించాలని అంటున్నారు. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన వ్యవహారం అంతా పార్టీకి నష్టం కలిగించేలా ఉందని ఇప్పుడు కూడా తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి (Kishan Reddy) ఇస్తూ రాజాసింగ్‌ మా ఎమ్మెల్యే కాదు సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు సమాచారం ఇవ్వమని కిషన్ రెడ్డికి చెప్పటం ఏంటి అని మండిపడుతున్నారు. రాజాసింగ్ ను బతిమిలాడాల్సిన అవసరం లేదని ఆయన దారిలో ఆయన వెళ్ళనివ్వండని వాదిస్తున్నారు. దీంతో రాజాసింగ్ దారెటు అనేది సస్పెన్స్ గా మారింది. ఆయన మరేదైనా పార్టీలో చేరుతారా? లేక సొంత వేదిక ఏర్పాటు చేసుకోబోతున్నారా? నిర్ణయం ఏదైనా రాజాసింగ్ వెంట నడిచే బీజేపీ నేతలు ఎవరు అనే అంశాలు ప్రస్తుతం ఉత్కంఠగా మారాయి.

అధిష్టానానికి చాలెంజ్:

తాజా పరిణామాలు బీజేపీ అధిష్టానానికి సవాలుగా మారాయి. నిజానికి 2023 ఎన్నికలకు ముందు మంచి ఊపులో ఉన్న బీజేపీ అనూహ్యంగా డౌన్ ఫాల్ అవుతూ వస్తోంది. నేతల మధ్య సఖ్యత లేకపోవడమే దీనికి కారణం అనే చర్చ జరుగుతూ వచ్చింది. ఓ దశలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే అనే పరిస్థితి నుంచి అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఏంటనే వాదన కమలం పార్టీలో ఉంది. పార్టీలో నెలకొన్న గందరగోళానికి మోడీ, అమిత్ షా ద్వయం తమదైన స్టైల్ లో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కొత్త అధ్యక్షుడి రూపంలోనే వీటన్నింటికి సమాధానం చెబుతూ టీ బీజేపీని రాబోయే 2029 ఎన్నికల కోసం గాడిన పెట్టబోతున్నారనే టాక్ వినిపిసించింది. కానీ అనూహ్యంగా రామచందర్ రావు పేరును ఖరారు చేయడంతో ఈ నిర్ణయం పట్ల ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎలాంటి పదవులు, ఇతర ప్రయోజనాలు ఆశించకుండా పార్టీ సిద్ధాంతం కోసమే పని చేస్తున్న కార్యకర్తలను నిరాశపరిచేలా అధిష్టానం నిర్ణయం ఉందనే విమర్శలు, కామెంట్స్ వ్యక్తం అయ్యాయి. అయితే ఇదంతా టీ కప్పులో తుఫాన్ వంటిదేనని అంతా సర్దుకుంటుంది అనుకునే లోపే రాజాసింగ్ సంచలన నిర్ణయంతో మళ్ళీ కథ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతర్గత కీచులాట అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారిందని దాంతో చేసేదేమి లేక ఇంత కాలం సాగదీస్తూ వచ్చిన అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో చివరలో చివరకు మళ్లీ అసంతృప్తినే మూటగట్టుకోవాల్సి వస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో తాజా పరిణామాలు కమలం పార్టీని ఎటువైపు చేర్చుతాయి? వీటికి పరిష్కారంగా అధిష్టానం ఎలాంటి ప్రణాళికలతో రాబోతున్నది అనేది రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ గా మారింది. త్వరలోనే మరో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ కు బై పోల్, ఆ తర్వాత జీహెచ్ఎంసీకి ఇలా వరుసగా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు కూల్ వెదర్ లో హాట్ హాట్ గా మారుతున్నాయి.

Next Story