గ్రామపంచాయతీ ఎన్నికల్లో 600లకు పైగా సీట్లు గెలిచాం : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు

by Muthe.Rajitha |

సర్దార్ వల్లభాయ్ పటేల్ 560కి పైగా సంస్ధాలను ఏకీకృతం చేసి, ఒక మహత్తరమైన భారతదేశాన్ని నిర్మించిన మహానుభావుడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో 600లకు పైగా సీట్లు గెలిచాం : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సర్దార్ వల్లభాయ్ పటేల్ 560కి పైగా సంస్ధాలను ఏకీకృతం చేసి, ఒక మహత్తరమైన భారతదేశాన్ని నిర్మించిన మహానుభావుడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతమంతా భారతదేశంలో భాగమై మనం గర్వంగా భారతీయులమని చెప్పుకుంటున్నామంటే దానికి పటేలే కారణమన్నారు. సోమవారం పటేల్​వర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆపరేషన్ పోలో ద్వారా నిజాంను తలవంచేలా చేసి, హైదరాబాద్ స్టేట్‌ను భారతదేశంలో అంతర్భాగం చేసిన వ్యక్తిగా ఆయనను తెలంగాణ ప్రజలు ఏనాటి మరవలేమన్నారు.

తరువాత కాలంలో ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీని ప్రకటించారు. నెహ్రూను ఎదిరించి, రాజ్యాంగాన్ని కాపాడాలనే దృఢమైన వైఖరితో నిలబడిన నాయకుడు పటేల్ అని, అలాంటి మహానాయకుడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మర్చిపోయిందని మండిపడ్డారు.ఎవరైతే రాజ్యాంగాన్ని అవహేళన చేశారో, కాలరాశారో, అలాంటి కాంగ్రెస్ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని, ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు ‘ఓట్ చోరీ’ అంటూ మాట్లాడారు. ప్రియాంకా గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను బెదిరించే స్థాయికి వెళ్లారు.

గతంలో ప్రజలను కాల్చేస్తామని, కాల్చేయాలని కూడా మాట్లాడిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో బీజేపీ అధికారం పోతుందని, ప్రజల ఓట్లు తొలగిస్తుందని, దీంతో ఆధార్ కార్డు పోతుందని వ్యాఖ్యలు చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద ఇంత ప్రేమ ఎందుకని వాళ్ల ఓట్లు తీసేస్తే కాంగ్రెస్​నేతలకు ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎక్కడా భారతీయులు కాని వారికి ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండాలనే అవకాశం లేదు. తమ పార్టీ ఈ విషయానికి పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. భారతదేశంలో ఉన్న నిజమైన భారతీయుల పేర్లే ఓటర్ లిస్ట్‌లో ఉండాలి. అర్హులైన వారి పేర్లు ఎప్పటికీ తొలగించబడవని తెలిపారు.

ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనారిటీలు మోడీ ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక, ఎన్నికల్లో ఓడిపోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. కులం, మతం, ప్రాంతాల పేరు మీద రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మెజార్టీ సీట్లు గెలిచామని లెక్కలేస్తున్నారు. కొన్ని చోట్ల బెదిరింపులతో గెలిచారని, తమ పార్టీ అభ్యర్ధులను ప్రజలు గెలిపించారు. గతంలో బిజెపి కి 163 సీట్లు మాత్రమే వచ్చాయని ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో 600కి పైగా సర్పంచ్ స్థానాలు గెలిచామన్నారు. రానున్న మూడో విడత ఎన్నికల్లోనూ మరిన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story