నీ సీటు కూడా గెలిచి తీరుతాం.. కూనంనేని చాలెంజ్‍పై ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరాావు చేసిన సవాల్‍ను స్వీకరిస్తున్నామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

నీ సీటు కూడా గెలిచి తీరుతాం.. కూనంనేని చాలెంజ్‍పై ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎపుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‍కు, రేవంత్‍కు అవే చివరి ఎన్నికలు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్, బీఆర్‍ఎస్ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. స్వంత పార్టీని కాపాడుకోలేక, బీఆర్ఎస్ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నారని, చిట్‍చాట్‍ల పేరుతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీని బద్నాం చేసేందుకు మాట్లాడుతున్న మాటలు బాధాకరం అన్నారు. జై తెలంగాణ నినాదంతో ఇతర పార్టీలను టార్గెట్ చేస్తున్నారని తెలంగాణ భూమి పుత్రులు అంటే ఎవరు? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజల విషయంలో బీఆర్ఎస్ ఎన్ని మాటలు చెప్పలేదు? మార్చ లేదు? దోచుకుంటున్నారనే బీఆర్ఎస్‍ను జనం ఇంటికి పంపించారన్నారు.

కూనంనేని సవాల్ స్వీకరిస్తున్నాం:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన చాలెంజ్‍పై రఘునందన్ రావు స్పందించారు. తెలంగాణలో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సీపీఐ పోటీ చేసి గెలుస్తుందా? పొత్తు లేకుండా కమ్యూనిస్టులు గెలుస్తారా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులను ప్రజలు ఎప్పుడో లెఫ్ట్ చేశారని స్వంతంగా నిలబడే పరిస్తితి ఆపార్టీలకు లేదన్నారు. కూనంనేని సవాలును స్వీకరిస్తున్నామని ఖమ్మంలో రానున్న ఎన్నికల్లో గెలుస్తామన్నారు. కూనంనేని సీటును సైతం తామే గెల్చుకోబోతున్నామన్నారు. మా బలం మా కార్యకర్తలు.. అంత్యోదయ మా సిద్ధాంతం అన్నారు.

కాంగ్రెస్ తప్పులకు చర్యలు తప్పవు:

అన్ని రాష్ట్రాలను సమ దృష్టితో చూసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ తూర్పు అయితే బీజేపీ పడమర అని బీజేపీ పోరాటం కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నామని, కాంగ్రెస్ చేసిన తప్పులకు ప్రజా క్షేత్రంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. వెస్ట్ బెంగాల్‍లో బీజేపీ గెలిచిందంటే, తెలంగాణలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్‍ను ఒంటరిగా గెలిగేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

Next Story