తరుగు తీస్తేనే తరలిస్తాం.. ధాన్యం సేకరణపై మిల్లర్ల కొర్రీలు!

by Kema Shiva Kumar |

తెలంగాణలో ధాన్యం సేకరణపై మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. తరుగు పేరుతో బస్తాకు 5 కిలోల కోత విధిస్తేనే ధాన్యం తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

తరుగు తీస్తేనే తరలిస్తాం.. ధాన్యం సేకరణపై మిల్లర్ల కొర్రీలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు తీసి తూకం వేసిన ధాన్యం మాత్రమే సీఎంఆర్‌కు తరలిస్తామని మిల్లర్లు హెచ్చరిసున్నట్లు తెలిసింది. ఎండిన ధాన్యం పెద్ద మొత్తంలో కేంద్రాలకు రావడంతో సెంటర్ల సిబ్బందికి రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు లేకుండా ఉన్నదాన్ని మాత్రమే కాంటాకు వేయాలని సూచనలు చేసినట్లు సమాచారం. నేరుగా తూకం వేస్తే బస్తాకు 5 నుంచి 6 కిలోల తరుగు కింద కోత పెట్టాలని లేదంటే ధాన్యం తీసుకెళ్లమని చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రైతుల నుంచి ధాన్యం సేకరణ సమయంలో ఎలాంటి తరుగు తీయవద్దని మంత్రులు, కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు చెప్పినా మిల్లర్లు లెక్క చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తూకం వేసినా తాము మిల్లుల వద్ద ధాన్యం దించే ముందు తరుగు చేసి పరిగణనలోకి తీసుకుంటామని బాహాటంగా చెబుతున్నారు. తాము క్వింటాల్​ధాన్యంపై 67 కిలోల బియ్యాన్ని లేవీగా ఇవ్వాల్సి ఉంటుందని, ఈ సీజన్‌లో పండిన ధాన్యాన్ని సీఎంఆర్​చేస్తే 60 కిలోల బియ్యమే వస్తున్నాయని చెబుతున్నారు. ఎక్కువ వేడి కారణంగా బియ్యం నూకగా మారడంతో తాము నష్టపోతున్నామని, ధాన్యం తరుగు తీస్తేనే గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. తేమ శాతం విషయంలో కూడా మిల్లర్లు కొర్రీలు పెడుతున్నట్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు.

ఇప్పటికి 25 లక్షల మెట్రిక్​ టన్నులు..

ప్రభుత్వం ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు 25 లక్షలు సేకరించగా అందులో 9 లక్షల మెట్రిక్​టన్నులు సన్నధాన్యం, 16 లక్షల మెట్రిక్​టన్నులు దొడ్డు రకాన్ని కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,575 కొనుగోలు కేంద్రాలకు అందుబాటులోకి తీసుకురాగా జూన్​30 వరకు ధాన్యం కొనుగోళ్లు జరిగేలా ఏర్పాట్లు చేసింది. అయితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో తరుగు పేరిట కోతలు లేకుండా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నా, తరుగు తీస్తేనే కాంటాలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు కాంటా పూర్తయిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన సమయంలో లారీలు అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు.

గన్నీ బ్యాగుల కొరత..

మరోవైపు పలు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత ఉంది. బస్తాలు లేకపోవడంతో తూకం ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. ఓ అకాల వర్షాలు రైతులను భయపెట్టిస్తుంటే.. గన్నీ సంచులు అందుబాటులో లేకపోవడంతో మరింత ఆందోళనకు​గురవుతున్నారు. ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి, గద్వాల, వనపర్తి జిల్లాల్లో పౌరసరఫరాల అధికారులు బస్తాలు కావాలని ఉన్నతాధికారులకు నివేదించారు. కొన్ని గ్రామాల్లో గన్నీ బస్తాల కొరతతో కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు చెప్పినట్లు తరుగు పేరుతో బస్తాకు 5కిలోల కోత పెడితే ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం తరలించమని రైతులు హెచ్చరిస్తున్నారు. ట్రాక్టర్లు, డీసీఎం ద్వారా ధాన్యం తీసుకొస్తే గుట్టుగా వే బ్రిడ్జి వద్దనే కోత పడుతుందని, మళ్లీ కేంద్రాల్లో తరుగు తీస్తే తమకు మిగిలేది ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story