‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌’గా తెలంగాణను మారుస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌’గా తెలంగాణను మారుస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐఖోర్(ICHOR) బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణలో భాగంగా 1.75 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న కొత్త ప్లాంట్ (ఫెసిలిటీ) నిర్మాణానికి మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. ఈ లక్ష్య సాధనలో ‘ఐఖోర్’ రూపంలో మరో అడుగు ముందుకు పడిందని పేర్కొన్నారు. ఈ ఫెసిలిటీ సెంటర్‌తో కొత్తగా 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) 23 శాతానికి పెరిగిందని అన్నారు. అదే సమయంలో జాతీయ సగటు కేవలం 14 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ జీఎస్డీపీలో లైఫ్ సైన్సెస్ రంగం వాటా 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ఉందని.. ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు అని శ్రీధర్ బాబు వివరించారు.

బీఆర్‌ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్-2025 నివేదిక ప్రకారం ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్ల జాబితాలో బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, టోక్యో తదితర నగరాల సరసన హైదరాబాద్ చేరిందని మంత్రి శ్రీధర్ తెలిపారు. భారత్ నుంచి ఈ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్న నగరం హైదరాబాద్ కావడం మనకు గర్వకారణమని అన్నారు. 2024లో హైదరాబాద్‌లో 2.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లైఫ్ సైన్సెస్ సంస్థలు కొత్తగా అద్దెకు తీసుకున్నాయని పేర్కొన్నారు. ఇది 2023లో 1.8 మిలియన్ చదరపు అడుగులు, 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు మాత్రమే కావడం గమనార్హమని అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగ వృద్ధికి ఊతమిచ్చేలా అవసరమైన ఎకో సిస్టమ్‌ను నిర్మించడంలో తెలంగాణ ప్రపంచానికి దిక్సూచీగా మారిందని తెలిపారు. హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-బెంగళూర్ కారిడార్‌లలో ప్రత్యేకంగా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేయబోతున్నామని మంత్రి పేర్కొన్నారు.

నెక్స్ట్ జనరేషన్ బయో-మాన్యుఫ్యాక్చరింగ్, సెల్ అండ్ జీన్‌థెరపీ, ఏఐ ఆధారిత రోగ నిర్థారణ, ఔషధాల ఉత్పత్తి, అరుదైన వ్యాధులపై పరిశోధన, సుస్థిరాభివృద్ధికి అడుగులు పడేలా చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్రీన్ కెమిస్ట్రీ, బయో- కాంట్రాక్ట్ రీసెర్చ్, మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (CRAMS) తదితర అంశాల్లో తెలంగాణను ప్రపంచ లైఫ్ సైన్సెస్ పటంలో అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి సారించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకు కోరారు. అందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

Next Story