ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం: మంత్రి అజహరుద్దీన్

by Taduka Kalyani |

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం: మంత్రి అజహరుద్దీన్
X

దిశ, మంచాల: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మంత్రి సందర్శించారు. పాఠశాలలోని విద్యా, క్రీడా, మౌలిక వసతులను పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమై ప్లేగ్రౌండ్‌లో కాసేపు క్రికెట్ ఆడి అలరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య గడపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక విద్యా వాతావరణం, డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, విశాలమైన క్రీడా మైదానాలతో పాటు బాస్కెట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.మా చిన్నతనంలో ఇలాంటి సౌకర్యాలు లేకపోయినా కష్టపడి చదివి ఎదిగాం ప్రస్తుతం విద్యార్థులకు లభిస్తున్న ఈ అధునాతన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని చెప్పారు. జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఉపాధ్యాయులను గౌరవించాలని, తల్లిదండ్రుల ఆశలు, త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటమిని చూసి నిరాశ చెందకుండా నిరంతర సాధనతో ముందుకు సాగాలన్నారు. పాఠశాలలో ఏర్పడే స్నేహాలు జీవితాంతం నిలుస్తాయని.. పరస్పర గౌరవం, సహకారం, ముఖ్యంగా బాలికలను గౌరవించే సంస్కారాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా వినయాన్ని కోల్పోకుండా నిరాడంబరంగా ఉండటమే నిజమైన గొప్పతనమన్నారు.ఈ పాఠశాల నుంచి భవిష్యత్తులో వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, పరిపాలనా అధికారులు తయారై దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఒకే క్యాంపస్‌లో ఇంటర్ వరకు విద్య: అదనపు కలెక్టర్ కిరణ్మయి

అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానం ద్వారా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో నాణ్యమైన విద్యను అందించేలా ఆధునిక వసతులు కల్పించామన్నారు.మధ్యాహ్న భోజన పథకాన్ని బలోపేతం చేస్తూ డైట్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విజయం అంటే కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం మాత్రమే కాదని, ఎంచుకున్న ప్రతి రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో శ్రమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, మంచాల్ తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో వసంత లక్ష్మీ,ఆరుట్ల సర్పంచ్ శోభారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story