ప్రజా పోరాటాలతో మీకు బుద్ధి చెప్తాం.. సర్కారుపై తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-26 09:14:23  IST  )

సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడేందుకు తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్ (HMS) దీర్ఘకాలం పోరాటం చేసినా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు.

ప్రజా పోరాటాలతో మీకు బుద్ధి చెప్తాం.. సర్కారుపై తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడేందుకు తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్ (HMS) దీర్ఘకాలం పోరాటం చేసినా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో సర్కార్ వైఖరిపై ఇవాళ ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజాగా ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు (Medical Board)లో మోసం జరిగిందని, 129 మంది రిటైర్మెంట్ సన్నాహక కార్మికుల్లో కేవలం 23 మందిని మాత్రమే అన్‌ఫిట్‌గా ప్రకటించి, మిగతా 106 మందిని అండర్‌గ్రౌండ్ నుంచి సర్ఫేస్‌కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 106 మందిలో కూడా సీనియారిటీని పాటించకుండా 10 మందిలో ఒకరిగా మార్చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఆ 129 మంది కార్మికులు తాము రిటైర్ అయి తమ పిల్లలకు లేదా కావాల్సిన వారికి ఉద్యోగం ఇప్పించాలని కోరుకుంటున్నారని తెలిపారు. సింగరేణిలో యువ రక్తాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ.. తద్వారా తమ కుటుంబం బాగుంటుందని కార్మికులు భావించారని ఆమె అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ బోర్డు నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. గతంలో తాము అధికారులను ఒప్పించి 85 శాతం వరకు అన్‌ఫిట్ చేయించామని గుర్తు చేశారు. మిగతా వారిని కూడా మళ్లీ మళ్లీ మెడికల్ బోర్డుకు తీసుకొచ్చి అన్‌ఫిట్ అయ్యేలా కృషి చేశామని అన్నారు. సింగరేణి సంస్థ కొనసాగాలనే ఉద్దేశంతోనే డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలని పోరాడామన్నారు. నడ్డి విరిచే దాకా సింగరేణి కోసం పని చేసిన కార్మికుని బిడ్డలకు భరోసా ఉండాలని కృషి చేశామని అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కిందని ఆమె ఆరోపించారు. సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా కేవలం 18 శాతం మందికే అన్‌ఫిట్ చేయడం చాలా అన్యాయమని తెలిపారు.

గతంలో కూడా 54 మందితో మెడికల్ బోర్డు పెట్టారని.. అందులో తీవ్రమైన అన్యాయం చేస్తూ నలుగురిని మాత్రమే అన్‌ఫిట్ చేశారని ఆమె ఆరోపించారు. మిగతా 50 మందిని ఎందుకు మెడికల్ బోర్డుకు పిలవలేదని ప్రశ్నించారు. తక్షణమే వారిని కూడా అన్‌ఫిట్‌కు పిలవాలని డిమాండ్ చేశారు. ఎవరైతే తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నారో వారికి ఇవ్వడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. కానీ, ఆ ఉద్యోగాలను ఇవ్వకుండా ఆపేందుకు రేవంత్ సర్కార్ పని చేస్తోందని.. తీరు మారకపోతే మళ్లీ ప్రజా పోరాటాలతో వారికి బుద్ధి చెప్తామని కవిత హెచ్చరించారు.

Next Story