పీసీబీ సైంటిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి కొండా సురేఖ

by Naga Rani Yarlagadda |

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో సైంటిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

పీసీబీ సైంటిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి కొండా సురేఖ
X
  • రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
  • మంత్రిని కలిసిన సైంటిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో సైంటిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పీసీబీ శాస్త్రవేత్తల అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్​ ప్రసాద్​ నేతృత్వంలో ఆ సంఘం జనరల్ సెక్రటరీ, కార్యనిర్వాహక సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మొట్ట మొదటి రిజిస్టర్డ్​ అసోసియేషన్​ ఏర్పాటు చేశామని మంత్రి సురేఖకు వివరించారు. తమ సమస్యలను ఉన్నత అధికారులకు, ప్రభుత్వానికి తెలియచేయడానికి పర్యావరణ కాలుష్యం నిరోధించడానికి ఈ అసోసియేషన్ కృషి చేస్తుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సైంటిఫిక్ అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా మంత్రికి తమ సమస్యలు, ఇంకా విధులలో తమకు జరుగుతున్న వివక్షను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విధుల్లో సముచిత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించటం లేదని తెలిపారు.

ఇటీవల ప్రతిపాదించిన 42 పోస్టులలో కేవలం ఎనిమిది పోస్టులు మాత్రమే శాస్త్రవేత్తలకు కేటాయించి మిగిలిన వాటిని ఇంజినీరింగ్​పోస్టులతో కొత్త జోనల్, రీజనల్ ఆఫీసుల ఏర్పాటుకు ప్రతిపాదించారన్నారు. జోనల్ ఆఫీసుల్లో ఏర్పాటుకు జోనల్ ల్యాబ్​ కూడా ఉండాలని, కాని వాటిని ప్రతిపాదించలేదని చెప్పారు. ఈ విధంగా అన్నింట తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వివరించారు. శాస్త్రవేత్తలకు కనీసం ఆఫీస్ లాగిన్​ఐడీలు కూడా ఇవ్వకుండా వారిని పర్యావరణ, పరిశ్రమలలో నమూనాలను సైతం సేకరించడానికి వినియోగించటం లేదని మంత్రికి తెలిపారు. కాగా.. వీరి విజ్ఞప్తి మేరకు పీసీబీలో జరుగుతున్నా వివక్షకు సంబంధించి పూర్తి వివరాలు తెప్పించుకుని పరిశ్రమల తనిఖీల్లో ఒక శాస్త్రవేత్తను విధిగా ఉండాలన్న నిబంధనను విధిస్తామని మంత్రి హామీనిచ్చినట్టు తెలిసింది. ఇక లాగిన్​ఐడీ అన్నది ప్రతి అధికారికి ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు శాస్త్రవేత్తలు చాలా ముఖ్యమని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Next Story