ఎస్ఎల్‌బీసీపై నిర్లక్ష్యం చేస్తే సహించం : మంత్రి ఉత్తమ్‌కుమార్

by Naga Rani Yarlagadda |

ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టులో జాప్యం, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఎస్ఎల్‌బీసీపై నిర్లక్ష్యం చేస్తే సహించం : మంత్రి ఉత్తమ్‌కుమార్
X
  • నిరంతరం పనుల సమీక్ష పై రూట్ మ్యాప్
  • భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
  • ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది
  • కాళేశ్వరం పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
  • ప్రభుత్వం చేతికి హెలి-బోర్న్ సర్వే నివేదిక

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టులో జాప్యం, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం ప్రాజెక్టు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కింద మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొరంగం మార్గం పనులను నిరంతరం కొనసాగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. అర్ధంతరంగా నిలిచిపోయిన పనుల పునరుద్ధరణకు చేపట్టిన హెలి-బోర్న్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని ఆయన చెప్పారు. మిగిలిన సొరంగ మార్గం పూర్తి చేయడానికి అవసరమైన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఏరియల్ ఎలాక్ట్రో మాగ్నెటిక్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని చెప్పారు. భౌగోళికంగా ప్రతికూల పరిస్థితిలు ఏర్పడితే ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టదానికి ఈ సర్వే ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంతోపాటు శాస్త్రీయ పద్ధతిలో నిరంతరం అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణకు ప్రత్యేకంగా డివిజన్ ఏర్పాటు చేయడంతోపాటు ఆపరేషన్ బృందానికి ప్రత్యేక చీఫ్ ఇంజినీర్‌ను నియమించాలని ఆదేశించారు. అధికారులు రూపొందించిన డిజైన్ ప్రకారం నిర్మాణం కొనసాగేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన చీఫ్ ఇంజినీర్ కు సహకరించేలా ఉండేందుకు స్వతంత్ర పర్యవేక్షణ కన్సల్టెంట్‌ను నియమించాలని సూచించారు. నిరంతరం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యులవుతారని చెప్పారు. అదే సమయంలో సొరంగ మార్గంలో ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక జియో టెక్నికల్, జియాలజికల్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

కాళేశ్వరం పునరుద్ధరణ పనులు వేగవంతం

కాళేశ్వరం బ్యారేజ్‌ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడానికి అవసరమైన సాంకేతిక సంస్థలను, డిజైన్ కన్సల్టెంట్స్ సమన్వయంపై మంత్రి అధికారులకు వివరించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించే పరీక్షల షెడ్యూల్, ప్రాజెక్ట్ డిజైనర్ల పనితో సమన్వయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరస్పరం సమన్వయం చేసుకుంటూ పోతే కేంద్ర జల వనరుల సంఘం పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుండి డిజైన్లకు దశలవారిగా అనుమతులు పొందడం సులభతరం అవుతుందని చెప్పారు. ఫిబ్రవరి 16 తరువాత ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించాలని సూచించారు. పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అనుమతులు పొంది పనులు వేగవంతం చేయాలని సూచించారు.

Next Story