ఏ ఎన్నికలు వచ్చినా మాకు తిరుగులేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

by Kema Shiva Kumar |

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

ఏ ఎన్నికలు వచ్చినా మాకు తిరుగులేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రైతుభరోసా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని అన్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చించి నిర్ణయం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలన గోల్డెన్ పిరియడ్ అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని కామెంట్ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలు, జుబ్లీహీల్స్‌ ఉపఎన్నికకు పార్టీని సన్నద్ధం చేసేలా పలు కీలక నిర్ణయాలుతో వచ్చే GHMC ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహలపై వరుస సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు గెలిచేది కూడా తామేనని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నాం..

రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌ రైతు పక్షపాతి ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నామని తెలిపారు. తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో, జుబ్లీహీల్స్‌ ఉప ఎన్నికల్లో తమకు తిరుగు లేదన్నారు. మూడు ముక్కలాటతో బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం అయిందన్నారు. కవిత చెప్పినట్టు బీఆర్‌ఎస్‌లో దెయ్యాలుంటే.. కాంగ్రెస్‌లో దేవతలున్నారని కామెంట్ చేశారు. మహిళల అభివృద్ధి గురించి కవిత మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య. కవితకు మద్దతు మాట్లాడటం విచారకరమని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వెలగబెట్టింది ఏమి లేదని.. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. దేశ చరిత్రలో అదో హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా.. శిక్ష తప్పదని అన్నారు. కాళేశ్వరంతో పాటు పలు కుంభకోణాలను వెలుగుతీసి ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నిధులను, పథకాలను మంజూరు చేయకుండా వివక్ష చూపిస్తోందని అన్నారు. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరకోబోమని.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టుకోమని జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో హరీశ్ రావు సంతకం ఎందుకు పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అభూత కల్పనతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యవస్థను నడుపుతున్నారని.. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి ప్రచారాలను ప్రజలు తీప్పి కొట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Next Story