- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీజేపీ పార్లమెంట్ మార్చ్‌లో ఉద్రిక్తత.. వైరల్ వీడియోపై ఢిల్లీ పోలీసుల క్లారిటీ
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు తీవ్ర దుమారం రేపాయి. ఢిల్లీ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, నిరసనకారులపై అమానుషంగా దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పలు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఓ వీడియోపై మంగళవారం ఢిల్లీ పోలీసులు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.
నెట్టింట వైరల్ అవుతున్న ఆరోపణలు..
పోలీసుల తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కొందరు విద్యార్థులు మేకులు బిగించి ఉన్న లాఠీని చూపిస్తూ.. ఢిల్లీ పోలీసులు తమ లాఠీచార్జ్‌లో వీటినే ఉపయోగించారని ఆరోపించారు. దీనిపై ఓ నెటిజన్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘జంతర్ మంతర్ వద్ద తలల నుంచి రక్తం కారుతున్న నిరసనకారులను మీరు చాలా మందిని చూస్తారు.’ అని పోస్ట్ చేశారు.
ఫేక్ న్యూస్‌గా తేల్చిన ఢిల్లీ పోలీసులు
ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా ఈ వార్తలను ఖండిస్తూ నెటిజన్లకు రిప్లై ఇచ్చారు. ‘ఫేక్ న్యూస్ అలర్ట్, నిన్నటి నిరసనలో పోలీసులు మేకులు బిగించిన లాఠీలను ఉపయోగించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలు అబద్ధం మరియు తప్పుదోవ పట్టించేవి. ఆ వీడియోలకు, నిన్న జరిగిన నిరసన కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు’ అని పోలీసులు తమ పోస్ట్‌లో స్పష్టం చేశారు. అనంతరం తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని పౌరులకు సూచించారు. సోషల్ మీడియాలో కంటెంట్‌ను షేర్ చేయడానికి లేదా ఫార్వార్డ్ చేయడానికి ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు.






