ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్‌ఓలకు ఇవ్వడి.. ఓటర్లకు GHMC కమిషనర్ కీలక పిలుపు

by Kema Shiva Kumar |

'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)' ఫారాలను తక్షణమే బీఎల్‌ఓలకు అందజేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు.

ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్‌ఓలకు ఇవ్వడి..  ఓటర్లకు GHMC కమిషనర్ కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఓటర్లకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను నింపి సంబంధిత బీఎల్‌ఓ (BLO)లకు వెంటనే అందజేయండి. చివరి క్షణం వరకు ఆగవద్దు; అలా చేస్తే డిజిటలైజ్ చేయడానికి ఇబ్బంది అవ్వడంతో పాటు సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ ఫారమ్‌ను డిజిటలైజ్ చేసిన తర్వాత సమాచారాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది’ అని జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ హాల్‌లో మంగళవారం అదనపు కమిషనర్లు బి. సంతోష్, చంద్రకళలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అంశాలను ఆయన వెల్లడించారు.

ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటు నమోదుకు, సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని, అనవసరపు ఆందోళనలకు గురికావొద్దని సూచించారు. గత ఆరు నెలలుగా ఎక్కడ నివసిస్తుంటే అక్కడే ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. బీఎల్‌ఓలపై దాడి చేసిన ఘటనలో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదైందన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 47,36,669 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల్లో ఇప్పటికే 43 శాతం డిజిటలైజ్ చేశామని తెలిపారు. చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ అధికంగా జరిగిందని, సనత్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో 40 శాతం కంటే తక్కువగా నమోదైందని తెలిపారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు సహకరించి, ఎన్యూమరేషన్ ఫారాలను త్వరగా అందజేయాలని కోరారు.

హెల్ప్‌డెస్క్‌లు..

ఓటర్లకు సేవలు అందించేందుకు 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారుల (ERO) కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. అదనంగా డీఈఓ (DEO) & కమిషనర్ కార్యాలయం, ట్యాంక్‌బండ్ వద్ద కూడా ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించామన్నారు. ఈ వివరాలను పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలతో సమన్వయం కోసం అన్ని ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని బీఎల్‌ఓలు తమ బీఎల్‌ఏ (BLA)లతో వారానికి ఒకసారి సమావేశం కావాలని ఆదేశించారు.

అవగాహన కార్యక్రమాలు..

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఆటోరిక్షాల ద్వారా ప్రచార ప్రకటనలు, పత్రికలు, టీవీ, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA), రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎమ్‌ఎస్‌ (SMS)ల ద్వారా అవగాహన సందేశాలు పంపుతున్నామని వివరించారు.

రాజకీయ పార్టీలతో సమావేశం..

'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) – 2026'కి సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) సంతోష్ కుమార్, జోనల్ కమిషనర్ చంద్రకళతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ, బీఎస్పీ, సీపీఎం, ఆప్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించాలని కోరారు. చివరి నిమిషంలో హడావుడి లేకుండా బూత్ స్థాయి ఏజెంట్లు (BLA) చురుగ్గా పాల్గొని, అర్హులైన ఓటర్లు ఫారాలు త్వరగా పూర్తి చేసి సమర్పించేలా చూడాలని పార్టీల ప్రతినిధులకు సూచించారు.

Next Story