అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై కోర్టుకెళ్తాం: మెడికో పేరెంట్స్ అసోసియేషన్

by Kema Shiva Kumar |

ఎంబీబీఎస్ బీ-కేటగిరీలో నాలుగున్నరేళ్ల ఫీజుకు బదులు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తూ వేధిస్తున్న ప్రైవేటు మెడికల్ కాలేజీలపై కోర్టుకు వెళ్తామని తెలంగాణ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ హెచ్చరించింది.

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై కోర్టుకెళ్తాం: మెడికో పేరెంట్స్ అసోసియేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై కోర్టుకు వెళ్తామని రాష్ట్ర మెడికో పేరెంట్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఆదివారం హైదరాబాద్ బండ్లగూడలో నిర్వహించిన మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఎంబీబీఎస్ బీ-కేటగిరీలో నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజు తీసుకోవాలని ప్రభుత్వం, ఎఫ్ఆర్సీ స్పష్టం చేసినప్పటికీ... కొన్ని కాలేజీలు ఐదేళ్ల ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని మొండిగా వేధిస్తున్నాయని రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్య నారాయణాచారి తెలిపారు.

ప్రభుత్వ జీవోలను లెక్కచేయని కరీంనగర్‌లోని చల్మెడ కాలేజీపై ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజీ వసూలు చేస్తున్న అధిక ఫీజులపై కోర్టుకు వెళ్తామని, అలాగే చల్మెడ యాజమాన్యంపై ఎన్ఎంసీకి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. చల్మెడ కాలేజీ మొండి వైఖరికి నిరసనగా అతి త్వరలోనే పేరెంట్స్ అందరం కలిసి కరీంనగర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అసోసియేషన్ నిర్ణయించిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్షలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమయం వృథా కాకుండా సంతకాలు, వేలిముద్రలు సైతం పరీక్ష సమయం ప్రారంభం కాకముందే తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆహార సౌకర్యాలు కొరవడ్డాయని, హాస్టళ్లలో కనీస శానిటేషన్ లేక అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని విమర్శించారు. పలు కాలేజీలలో సిలబస్ పూర్తికాకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దీనికోసం అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలను కలుస్తారని అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రమేష్ పొడిశెట్టి, సంయుక్త కార్యదర్శి వెంకట్రావు, పత్రీ యాదగిరి, ఉపాధ్యక్షురాలు సుజాత, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, సంధ్య, చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రేఖ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story