రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం.. ఎవరితోనైనా కొట్లాడుతాం : సీఎం రేవంత్‌రెడ్డి

by Muthe.Rajitha |

‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమే మా ఆలోచన. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం.. ఎవరితోనైనా కొట్లాడుతాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం.. ఎవరితోనైనా కొట్లాడుతాం : సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమే మా ఆలోచన. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం.. ఎవరితోనైనా కొట్లాడుతాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం గోదావరి-బనకచర్లపై అఖిలపక్షం మీటింగ్ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న అన్యాయం.. నష్టంపై ఆయా పార్టీల ఎంపీలకు వివరించామని, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలకు తావు ఇవ్వకుండా భేటీ జరిగిందని చెప్పారు. రాష్ట్రానికి గోదావరి, కృష్ణా జలాలే ఆధారమని.. కానీ వీటిపై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. నేడు ఏపీ ప్రభుత్వం గోదావరి మీద బనకచర్ల నిర్మించడానికి కేసీఆర్ ఇచ్చిన అస్త్రమే కారణమని చెప్పారు. గోదావరిలో 3,000 టీఎంసీలు మిగులు జలాలు వృథాగా పోతున్నాయని ఏపీకి బ్రహ్మపదార్థం ఇచ్చారని ఆరోపించారు. వారే అన్నింటికీ ఒప్పుకొని.. రాయలసీమను రతనాల సీమగా చేస్తామని హామీలిచ్చి ఆ బురదను తమపై చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం..

సెప్టెంబర్ 9, 2016లో కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి నేతృత్వంలో ఢిల్లీలో కీలక సమావేశం జరిగిందని.. ఈ సమావేశానికి కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారని రేవంత్ తెలిపారు. ఆ సమయంలో గోదావరి, కృష్ణా జలాల మీద సుదీర్ఘ చర్చ కొనసాగిందని తెలిపారు. అదే సందర్భంలో 3,000 టీఎంసీలు గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నట్లు కేసీఆర్ చెప్పారని అన్నారు. గోదావరి నీటిని తరలించడం వల్ల రాయలసీమకు నీరు ఇవ్వొచ్చని ఉచిత సలహాలు ఇచ్చారని చెప్పారు. అయితే.. 2016 నుంచి 2019 వరకు ఈ ఆలోచనకు పునాది పడలేదని అన్నారు. 2019లో జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సీఎం అయ్యాక ఇద్దరు నాలుగు సార్లు కలుసుకున్నారని.. అప్పుడే పెద్దన్నగా సహకరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. గోదావరి-బనకచర్ల విషయంలో 2016లో కేసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్న అంశాల సాకుతోనే ఇప్పుడు ఏపీ ముందుకువెళ్తున్నదని అన్నారు.

వారిద్దరూ పాపాల బైరవులు..

ఏపీ చేపట్టేది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదని.. 300 టీఎంసీల కోసం నిర్మిస్తున్నదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆనాడే కేసీఆర్ 400 టీఎంసీలు తీసుకోవచ్చని అంగీకరించారని చెప్పారు. రాష్ట్రానికి నష్టం జరగొద్దనే ఆలోచనతో జలశక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశామని.. తమ ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని అన్నారు. ఉన్నఫలంగా హరీశ్ బకెట్లో బురద తీసుకుని తమపై చల్లాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘హరీశ్‌రావు.. ఈ పాపానికి కారకుడు మీ మామనే. మీరిద్దరూ పాపాల బైరవులు.. మీ ఇద్దరిని ఉరితీయాలి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో కమీషన్లకు కక్కుర్తి పడి కుట్రలు చేశారని.. వీళ్లు ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడలేదని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో మొదలైన ఏ ప్రాజెక్టును వీళ్లు పూర్తిచేయలేదని.. పదేళ్లలో పెండింగ్‌లో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని చెప్పారు. నెలనెలా రూ.1,000 కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేద్దామనుకుంటే తాము కనీసం రూ.500 కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.

కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే గ్రావిటీతో సాగునీరు అందేదని.. కమీషన్ల కక్కుర్తితో లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా సాగు నీరు అందలేదని సీఎం రేవంత్ విమర్శించారు. కట్టిన మూడేళ్లలోనే కుప్పకూలిందని అన్నారు. పదేళ్లు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేశారని.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గాలికి వదిలేశారని ఆరోపించారు. వాళ్ల ఇళ్లు నింపుకునేందుకు రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. తాము కష్టపడి ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభిస్తే మనుషులు చనిపోతే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఎక్కడ ఎవరు చనిపోయినా వాళ్ల ముఖాలు బల్బుల్లా వెలిగిపోతాయని ఎద్దేవా చేశారు.

‘హరీశ్‌రావు హుందాగా వ్యవహరించాలి. బద్ధాలతో కాలం వెళ్లదీయొద్దు. ఇవాళ మేం నిజాలు బయటపెట్టాం. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు?’ అని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, మూసీ ప్రక్షాళన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవొద్దా? అని ప్రశ్నించారు. ‘మీరు నిధులు ఇస్తామంటే చెప్పండి. మేం మీ ఫామ్ హౌస్‌కే వస్తాం. పది పైసల మిత్తి చొప్పున రూ.50 వేల కోట్లు అప్పు ఇవ్వండి.. ప్రభుత్వం తరఫున బాండ్లు సమర్పిస్తాం’ అని అన్నారు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు చేసిన తీరని ద్రోహం వల్లే ఏపీకి నీళ్లు వెళుతున్నాయని అన్నారు.

న్యాయం జరగకుంటే న్యాయస్థానాలకు..

రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. ఈ విషయంలో తమకు ఎలాంటి శష-భిషలు లేవని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందరినీ కలిసి సమస్యలను వివరిస్తాం.. అయినా న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం అన్ని ప్రక్రియలను అనుసరిస్తూ కేంద్రానికి సమస్యలను వివరిస్తున్నదని చెప్పారు. తాము సైలెంటుగా ఉన్నామని అనుకోవద్దని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేశామని.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పనిచేస్తున్నామని అన్నారు. అఖిలపక్షం సమావేశానికి అమాయకుడైన వద్దిరాజు రవిచంద్రను పంపించారని.. లీడర్‌ను పంపిస్తారనుకుంటే రీడర్‌ను పంపించారని ఎద్దేవా చేశారు. మామాఅల్లుళ్లు రాసిచ్చిన కాగితాన్ని తీసుకొచ్చి ఆయన చదివి వినిపించారని అన్నారు. ఆయనకు ఏం తెలియక వాకౌట్ చేసి వెళ్లిపోయారని తెలిపారు.

పలుకుబడి ఉందనుకుంటే భ్రమే..

చంద్రబాబునాయుడి‌కి కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే ఆయన భ్రమే అవుతుందని రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు తమ వద్ద ప్రణాళిక ఉందన్నారు. కేసీఆర్ చెప్పారని కాకుండా గోదావరి బేసిన్‌లో 3వేల టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయని మీరు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్యాప్ పెంచుకోవడం వల్ల.. దూరం తెచ్చుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని.. ఢిల్లీలో మోడీపై ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల పూర్తికావని అన్నారు.

1,000 టీఎంసీలకు గోదావరి మీద, 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇచ్చి మిగిలిన జలాలతో మీరు ఏమైనా కట్టుకోండని సూచించారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల వరద జలాలు ఏపీకి వస్తున్నాయని.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం కూలిపోవడం వల్ల ఆ నీటిని తాము వినియోగించలేకపోతున్నామని చెప్పారు. ‘మోడీకి చంద్రబాబు అవసరం ఉంది. చంద్రబాబుకు గోదావరి అవసరం ఉంది. అధికారం నీకు.. నీళ్లు నాకు’ అన్న చందంగా వారి బంధం ఉందన్నారు.

నేడు కేంద్ర మంత్రిని కలుస్తున్నాం..

రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా.. బనకచర్లపై కలిసికట్టుగా పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి బనకచర్లపై తమ అభ్యంతరాలను వివరిస్తామని తెలిపారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిరావాలని కోరారు. ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి అపాయింట్మెంట్ తీసుకుని సమస్యను వివరిస్తామన్నారు. పొలిటికల్ ఫైట్‌లో న్యాయం జరగకుంటే లీగల్ ఫైట్ చేద్దామని పిలుపునిచ్చారు.

Next Story