- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mala JAC: జూబ్లీహిల్స్ బై పోల్‍లో 300 మంది నామినేషన్‍లు వేస్తాం.. ప్రభుత్వానికి మాల జేఏసీ హెచ్చరిక
రేవంత్ రెడ్డి మాలల సమస్యలపై తక్షణమే స్పందించకుంటే కాంగ్రెస్ పార్టీ అంతానికి యుద్ధం చేస్తామని మాలలు హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ (SC categorization) పేరుతో మాల సమాజానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) 300 మంది మాలలు నామినేషన్లు వేయనున్నట్లు మాల జేఏసీ (Mala JAC) సంచలన ప్రకటన చేసింది. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‍లో మాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ ఎస్సీ వర్గీకరణ పేరుతో గడిచిన ఐదు నెలలుగా గ్రూప్-3లోని 25 మాల కులాలకు తీవ్ర నష్టం జరుగుతోందని విద్య, ఉద్యోగ, ప్రమోషన్లలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఐదు నెలలుగా కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీల అధ్యక్షులకు వినతి పత్రాలు అందజేసినా స్పందన కరువైందన్నారు. వర్గీకరణ వల్ల మాల సమాజానికి జరుగుతున్న నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ ఆకాంక్షను, ఆవేదనను తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అందులో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు జూబ్లీహిల్స్ లో 300 మంది మాలలతో నామినేషన్ వేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాల జేఏసీ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తక్షణమే సవరించడంతో పాటు మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ శాతం పెంచి 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై యుద్ధమే:
వర్గీకరణ ద్వారా మాలలను అన్ని రంగాల్లో నాశనం చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని మందాల భాస్కర్ ధ్వజమెత్తారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాల సామాజిక వర్గ విద్యార్థుల విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బకొట్టారని ఆరోపించారు. ప్రజాస్వామిక వాదులైన మాలలు కలిసికట్టుగా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి మాలలు కంకణం కట్టుకుంటారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాలల సమస్యలపై తక్షణమే స్పందించకుంటే కాంగ్రెస్ పార్టీ అంతం మాలల పంతంగా భావిస్తూ తమ నిరసన యుద్ధాన్ని కొనసాగిస్తామన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన తన సొంత కుటుంబం, అనుచరుల చేతుల్లో ఉన్నట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు.






