కేరళంలో భూభారతి అమలు చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-05 09:55:25  IST  )

కేరళంలో యూడీఎఫ్ సర్కార్ వస్తే.. తెలంగాణ మాదిరిగానే అక్కడ కూడా భూభారతిని అమల్లోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

కేరళంలో భూభారతి అమలు చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేరళంలో యూడిఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మాదిరిగానే ప్రజలకు ఇచ్చే ప్రతి హామీని కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మావేలిక్కర అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ముతర రాజ్‌కు మద్దతుగా ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని తెలిపారు. అదే విధంగా కేరళంలోకూడా యూడిఎఫ్ ప్రభుత్వం ఏర్పడితే ఐదు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేరళంలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎల్‌డిఎఫ్ పాలన ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక రంగాల్లో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. "కేరళం ప్రజలు ఈసారి స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. పది సంవత్సరాల అసమర్థ పాలనకు ముగింపు పలికి, అభివృద్ధి, పారదర్శక పాలన కోసం యూడిఎఫ్‌కు అధికారం అప్పగించాలి” అని మంత్రి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విభేదాలు పెంచే బీజేపీకి కేరళం లో స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం యూడిఎఫ్ మాత్రమేనని స్పష్టం చేశారు.“ఇది సాధారణ ఎన్నిక కాదు.. కేరళం భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించి, యూడిఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి ప్రచారానికి ప్రతిచోట ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

Next Story