- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తాం: ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనకు ఆవిర్భవించిన బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిందన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని.. గతంలో 35 లక్షల టన్నులుగా ఉన్న ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులకు చేరిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు దళారులను ఆశ్రయించి కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు పంటను విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందని, గ్రామీణ ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లోనూ విద్యుత్ కోతలు పెరిగాయని ఆరోపించారు. రైతులకు కేవలం ఎనిమిది గంటలపాటు మాత్రమే నాణ్యతలేని విద్యుత్ సరఫరా అవుతున్నదని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, యూరియా, డీఏపీ ఎరువుల కొరత ఏర్పడడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. రిజర్వాయర్లలో కనీస నీటి నిల్వలు కూడా నిర్వహించకపోవడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సముద్రంలోకి వదిలేయడం వల్ల రాష్ట్రంలో తీవ్ర తాగునీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పంపులను వెంటనే ప్రారంభించి రిజర్వాయర్లను నింపాలని రైతులు, రిటైర్డ్ ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై పార్లమెంట్‌లో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన తరహాలోనే తెలంగాణకు కూడా కేంద్రం నిధులు కేటాయించాలని అన్నారు. సింగరేణి సమస్యల పరిష్కారం, థర్మల్ ప్రాజెక్టుల పునరుద్ధరణ, బొగ్గు ఉత్పత్తి పెంపు, తాడిచర్ల-2 మైన్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.






