KCRను జైల్లో వేసేందుకు రూల్స్ ప్రకారమే వెళ్తాం.. సీఎం రేవంత్‌‌రెడ్డి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-12 13:59:57  IST  )

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు.

KCRను జైల్లో వేసేందుకు రూల్స్ ప్రకారమే వెళ్తాం.. సీఎం రేవంత్‌‌రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ టూర్ బిజీబిజీగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో పాటు అశ్వినీ వైష్ణవ్‌లను కలిశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో పాటు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం బయటకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029లో దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని.. తెలంగాణకు ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని కామెంట్ చేశారు. తనకు ఎవరూ పోటీ కాదని అన్నారు. మరో పదిన్నరేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని అన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తామని పేర్కొన్నారు. తమకు కేసీఆర్‌పై కక్ష సాధింపు లేదన్నారు. ఒకవేళ కేసీఆర్‌ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామని పేర్కొన్నారు.

అలా చేస్తే ఆయుష్షు తగ్గుతుంది..

తాము అధికారంలోకి వచ్చాక ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుందని సెటైర్లు వేశారు. ట్యాపింగ్ కాల్స్ వినడం ఓ మానసిక రోగమని కామెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం అధ్యయనం చేయాలని, ఆ బాధ్యత ఓ నిపుణుల కమిటీకి అప్పగించామని తెలిపారు. మూడు గేట్ల మరమ్మతుల తర్వాత ప్రాజెక్టు కూలితే.. ఆ నింద తమపై వేయాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు.

కేటీఆర్‌ను ఈడీ ఎందుకు విచారించదు..

కేసీఆర్, హరీశ్ రావు కోరినట్లుగా ప్రభుత్వం నడువదని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అక్రమాలు, ఫార్ములా ఈ-రేసుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎక్కడా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదో చెప్పాలన్నారు. త్వరలోనే అన్ని డాక్యుమెంట్లను సభలో పెడతానని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాం నుంచే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉందని తెలిపారు. పదేళ్ల పాటు కేసీఆర్‌ను ఆ విషయం గురించి అడగకుండా కిషన్ రెడ్డి తనను అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఎన్టీఆర్‌‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి

ఎన్టీఆర్ తెలుగు జాతి ఆస్తి అని.. ఆయన ఎవరి సొత్తు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. మార్చి 31 లోపు హైద్రాబాద్ మోట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియ పూర్తి చేస్తా్నమని అన్నారు. జూన్ 2న ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు చర్చ జరిపి అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు. వాస్తవాలు చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి తాను మాట్లాడినది తప్పని గ్రహించి క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందో అర్థం కావడం లేదన్నారు. కృష్ణ, గోదావరి బేసిన్‌లో తెలంగాణ‌కు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఆ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం తన ప్రాజెక్టులు పూర్తి చేస్తే వరద జలాల లెక్కలు తేలుతాయని అన్నారు. నికర జలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పకూడదని అన్నారు. గోదావరి, కృష్ణా నది బేసిన్‌లలో ప్రాజెక్టులు నిర్మించే విషయంలో ఒకే విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మనుషులను చంపేవాళ్లం కాదు..

మహబూబ్ నగర్‌లో ఓ కౌన్సిలర్ కోసం హత్యా రాజకీయాలు చేయ్యాల్సిన అవసరం తమకు లేదని సీఎం అన్నారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే బీజేపీ, సీబీఐ‌తో విచారణ జరిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అధిష్టానంతో జరిగిన సమావేశం‌లో కేబినెట్ విస్తరణ ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Next Story