వరద నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తాం : మంత్రి తుమ్మల

by Muthe.Rajitha |

కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత సమస్యగా అధికమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విమర్శించారు.

వరద నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తాం : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత సమస్యగా అధికమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విమర్శించారు. యూరియా సరైన సమయానికి సరఫరా చేయకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉందని, తెలంగాణలో పంటలకు సెప్టెంబర్ లో ఎరువులు చాలా అవసరం ఉంటుందన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వరదలతో సంభవించిన పంట నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతామని, ఖరీఫ్ సీజన్ కి 11 లక్షలు మెట్రిక్ టన్నులు కోరితే 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని ఇప్పటివరకు 5.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారని చెప్పారు. తెలంగాణ లో బ్లాక్ మార్కెట్ కు ఆస్కారం లేదని, జిల్లా కలెక్టర్ల వద్ద పూర్తి సమాచారం ఉంటుందని యూరియా సమస్య ఒక్క తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా ఉందన్నారు.

చైనా నుంచి ,ఎర్ర సముద్రం మీదుగా వచ్చే యూరియా రాకపోవడంతో యూరియా కొరత వచ్చిందని, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడంతో ,కేంద్ర వైఫల్యంతో కొరత ఏర్పడిందన్నారు. తెలంగాణలో భారీ వర్షాల ప్రాథమిక అంచనా ప్రకారం 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరతామని రామగుండంలో నాలుగు నెలలుగా ఉత్పత్తి లేదని ఇంకా 15 రోజుల వరకు ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదన్నారు. కొత్తగూడెం ఎయిర్ పోర్టు అంశంపై రామ్మోహన్ నాయుడును కలుస్తాం గత వరదల విషయంలో సాయం చేయలేదు. జేపీ నడ్డా,అమిత్ షా,శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, రామ్మోహన్ నాయుడు,అశ్విని వైష్ణవ్ ను కలుస్తామన్నారు. రెండు రోజులు పర్యటన చేసి కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు కేంద్ర మంత్రులకు వివరిస్తామన్నారు.

ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25 వేలు మద్ధతు ధర కల్పించాలి :

ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలోని నారాయణపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడం జిల్లాలను ప్రధాన్ మంత్రీ ధన్-ధాన్య కృషి యోజన పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ యంత్రాలపై, మైక్రో ఇరిగేషన్ పరికరాలపై ఉన్న 12 శాతం జిఎస్టీని మినహాంచాలన్నారు. పాస్పరస్ , పొటాషియం , సల్ఫర్ వంటి పోషకాలపై సబ్సిడీ పెంచి యూరియాతో సమానంగా ధరలో సమతుల్యత తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.24 వేల కోట్ల వార్షిక వ్యయంతో, ఆరు సంవత్సరాలపాటు అమలు చేయబోతున్న ధాన్య కృషి యోజన 36 కేంద్ర పథకాల సమన్వయంతో పాటు రాష్ట్ర పథకాలతో అనుసంధానం అవుతూ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా తక్కువ పనితీరు చూపుతున్న జిల్లాలకు విస్తృతంగా లాభం చేకూరుస్తుందని ప్రశంసించారు.

ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణ, నీటిపారుదల, నిల్వ, విలువవృద్ధి వంటి అంశాల్లో ఇది ఒక చారిత్రాత్మక పథకమని అన్నారు. రాష్ట్రంలోని నారాయణపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడం జిల్లాలను యోజన పథకం జాబితాలో చేర్చాలన్నారు. ఈ జిల్లాలు వర్షాధార పద్ధతులపై అధికంగా ఆధారపడిన, తక్కువ ఉత్పాదకత కలిగిన, బలహీన రైతు వర్గాలను కలిగి ఉన్నాయి. వీటిని చేర్చడంతో తెలంగాణ రైతుల సంక్షేమమే కాకుండా దేశవ్యాప్తంగా ఆహార భద్రత, విలువవృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుకు తోడ్పడుతుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్ర పథకాలతో పూర్తి అనుసంధానం చేస్తూ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అగ్రికల్చరల్ యూనివర్శిటీలు భాగస్వామ్యంతో బలమైన జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. డిజిటల్ మానిటరింగ్ ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తామని హామీ ఇచ్చారు.

వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ మినహాయించాలి :

వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై విధిస్తున్న 12 శాతం జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం, ఉద్యానవన రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని, రైతులకు ఆధునిక యంత్రాలు,నీటిపారుదల సాంకేతికత అందుబాటులో ఉంటే ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధించడం, రైతులపై తీవ్రమైన ఆర్థిక భారంగా మారిందన్నారు. చిన్న, సన్న రైతులు ఆధునిక పరికరాలను కొనుగోలు చేయలేకపోతున్నారని, ఫలితంగా వ్యవసాయంలో యాంత్రీకరణ, ఆధునిక పద్ధతుల వినియోగం మందగిస్తుందని వివరించారు. దేశ ఆహార భద్రత మరింత బలపడేదిశగా ఉండాలంటే ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై ఉన్న జీఎస్టీని మినయించాలని కోరారు.

ఎరువుల సబ్సిడీ పెంపు చేయాలి :

ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులపై సబ్సిడీ పెంపు అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. ప్రస్తుతం Nutrient Based Subsidy (NBS) విధానంతో యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఉన్నందున, రైతులు దానిని విస్తృతంగా వినియోగిస్తున్నారని, ఫలితంగా భూమిలో నత్రజని అధికమై, ఫాస్పరస్, పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాల వినియోగం తగ్గిపోతుందని వివరించారు. దీనితో నేలలో పోషక సమతుల్యత దెబ్బతింటోందని, పంట దిగుబడులు కూడా దీర్ఘకాలంలో పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా, 4:2:1 నత్రజని, ఫాస్పరస్, పొటాషియం సిఫార్సు నిష్పత్తి పూర్తిగా చెడిపోయి 2018-19లో 6.6:2.6:1కి పడిపోయిందని, ఇది రైతులకు దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమని గుర్తు చేశారు. తక్కువ ధరలో యూరియా లభించగా, అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఫాస్పరస్, పొటాషియం ఎరువులు ఖరీదుగా మారుతున్నాయని తెలిపారు.ఈ అంశాలపై స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వీటిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Next Story