- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: మిస్ వరల్డ్ పోటీల తరహాలో మరిన్ని గ్లోబల్ ఈవెంట్స్ కు ప్లాన్: సీఎం రేవంత్ రెడ్డి
ఇంకా మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లను తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని ఇంకా మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్లాన్ చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. తెలంగాణ రైజింగ్ (Rising Telangana) కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త క్యాంపస్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోందని హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారాలని.. మన విజయాలను ప్రపంచానికి చూపాలని పిలుపునిచ్చారు.
సంక్షేమంతో పాటు పరిశ్రమలకు మద్దతు:
నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్‌తో పాటు ఇంకా అనేక రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కు హబ్‌గా మారిందన్నారు. ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందన్నారు. నగరంలో అనేక ప్రముఖ కంపెనీలు తమ క్యాంపస్ లను విస్తరిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్నారు.
పెట్టుబడుల్లో నంబర్ వన్:
డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామన్నారు. 2025లో దావోస్‌లో తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని సీఎం చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రం పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలో నంబర్ వన్ గా ఉందని వెల్లడించారు. 66 లక్షల మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందన్నారు.






