పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం

by Elthuri vijay kumar |

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని దేవరకద్ర ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం
X

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం

-కరివెన రిజర్వాయర్ పెండింగ్ పనులు వెంటనే ప్రారంభిస్తాం

-ఆల్మట్టి ఎత్తు పెంచితే చూస్తూ ఊరుకోం

-బీఆర్ఎస్ నాయకుల గాలి మాటలను ప్రజలు నమ్మరు

-మీడియా సమావేశంలో పాలమూరు జిల్లా డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని దేవరకద్ర ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం భూత్పూర్ మండలం కరివెన రిజర్వాయర్ వద్ద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మూడేళ్లలో పూర్తి చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. కానీ 8 ఏండ్లు అధికారంలో ఉండి రూ.32,500 కోట్ల అంచనాలతో చేపట్టిన పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రూ.29 వేల కోట్ల ఖర్చు చేసి అందినంత దండుకున్నారు తప్ప పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. కనీసం మెయిన్ కెనాల్ కు అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు అన్నారు. పది సంవత్సరాల క్రితం ఉన్న భూముల ధరలు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి. మెయిన్ కెనాల్స్ కు సంబంధించి భూ సేకరణ అప్పట్లోనే చేసి ఉంటే ప్రభుత్వానికి భారం అయ్యేది కాదని జీఎంఆర్ పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.12 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఆల్మట్టి డ్యాం ఎత్తును కర్ణాటక ప్రభుత్వం పెంచితే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికినీ మన ప్రయోజనాలకు ఆటంకాలు ఏర్పడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆ ప్రభుత్వంతో మాట్లాడుతామని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మరని, ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడం తప్ప వారు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా ఆలస్యంగా లక్ష కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కాళేశ్వరాన్ని నిర్మించి ఎన్ని కోట్లు దండుకున్నారో ప్రజలకు తెలుసు.. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో ఆ వివరాలు అన్నీ బయటపడతాయని ఆయన చెప్పారు.

వచ్చే జూన్ లోపు కరివెన రిజర్వాయర్ పూర్తి చేస్తాం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న కరివేన రిజర్వాయర్ ను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జిఎంఆర్ చెప్పారు. ఈ రిజర్వాయర్ పూర్తి కావడానికి 450 కోట్ల రూపాయలు, మెయిన్ కెనాల్ కు అవసరమైన భూసేకరణకు రూ.500 కోట్లు అవసరం అవుతాయని అధికారులు లెక్కలు వేశారని ఎమ్మెల్యే తెలిపారు. కరివేన రిజర్వాయర్ నుండి భూత్పూర్ మండలం అమిస్తాపూర్ సమీపంలోని కోయిల్ సాగర్ వరకు మెయిన్ కెనాల్ ఏర్పాటు చేసి దేవరకద్ర నియోజకవర్గంలో 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. రిజర్వాయర్ పనులను వచ్చే జూన్ నాటికి పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ గౌడ్, నాగిరెడ్డి, శెట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story