గవర్నర్ వద్దకు మంత్రి పొంగులేటి వ్యవహారం!.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-30 06:14:31  IST  )

వట్టినాగులపల్లిలో రూ. 1400 కోట్ల భూమిని మంత్రి పొంగులేటి కబ్జా చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

గవర్నర్ వద్దకు మంత్రి పొంగులేటి వ్యవహారం!.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై (Ponguleti Srinivasa Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల విలువ చేసే భూమిపై పొంగులేటి కన్ను పడిందని ఆ భూ యజమానుల ఇంటికి వెళ్లి మంత్రి, మంత్రి కుమారుడు హర్ష బెదిరించారని ఆరోపించారు. వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడు కబ్జాకు యత్నించారని ఆరోపణలు ఉన్న భూమిని ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భూ యజమానులతో కలిసి మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఈ భూమిని తన సొంతం చేసుకునేందుకు మంత్రి స్వయంగా బెదిరించడంతో పాటు అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. 60 ఏళ్ల నుంచి ఈ భూమి సతీశ్ షా పేరు మీద ఉందన్నారు.

గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం:

నేనే రాజు.. నేనే మంత్రి.. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు లేవు అనేలా ప్రవర్తిస్తున్నారని, పొంగులేటి భూకబ్జాలపై వద్దకు గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని తెలిపారు. మా రాజ్యం మా ఇష్టం వచ్చినట్లు చేస్తామని ఎవరి భూములైనా లాక్కుంటాం.. మాట వినకపోతే బెదిరిస్తామనే విధంగా గూండా రాజ్యం నడుస్తోందన్నారు. వట్టినాగుల పల్లి భూమి బాధితులు సతీశ్, పల్లవికి సంపూర్ణంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి వ్యవహారం ఈ ఒక్క భూమితో ఆగలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయన్నారు. వట్టినాగులపల్లి ఘటనపై పోలీసులు వద్ద ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా, న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు.

శాసనమండలిలో హైడ్రామా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు

Next Story