- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పనిచేస్తేనే అగ్రస్థానంలో ఉంటాం: డీజీపీ జితేందర్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్దతో పని చేస్తే ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆ స్థానాన్ని నిలుపుకోగలుగుతుందని

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్దతో పని చేస్తే ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆ స్థానాన్ని నిలుపుకోగలుగుతుందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో శనివారం నాడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కీలకపాత్ర వహిస్తారని ఆ స్థాయిలో నిబద్ధతతో పనిచేస్తే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని కొనసాగించగలుగుతుందనే ఆశాభవం వ్యక్తం చేశారు. ప్రజల క్షేమమే పరమావధిగా భావిస్తూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం పోలీస్ శాఖకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది పని చేయాలని అన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అందుకోసం పోలీస్ శాఖ అవసరమైన అన్ని సదుపాయలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. పోలీసు సిబ్బంది ప్రజల కోసం ఉన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రజల శాంతి భద్రతలను కాపాడాల్సి ఉందని డిజిపి
సూచించారు. ప్రజల ఆకాంక్షలలో కాల క్రమేణా మార్పులు వస్తుంటాయని తదనుగుణంగా పోలీస్ సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తే పోలీస్ అధికారులకు మంచి పేరు ఉండదని తద్వారా పోలీసు సిబ్బంది భవిష్యత్తు ఆశించిన స్థాయిలో ఉండదని పేర్కొన్నారు. పోలీసు అధికారుల బంధువులు , స్నేహితులు ప్రజలే కాబట్టి వారి ద్వారా కూడా తమ పనితీరును అంచనా వేసుకోవచ్చన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ పనితీరును మెరుగుపరచుకోవడమే గాక తమ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బందిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని తద్వారా నిజం వెలికి తీయాలని , తద్వారా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. కన్విక్షన్ రేటు పెరిగినప్పుడు బాధితుల అభిమానం పొందగలుగుతామని నిందితులలో తప్పు చేయకూడద నే ఆలోచన రావాలన్నారు.
క్యూఆర్ కోడ్ సంతృప్తిని రాష్ట్రస్థాయి పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారని అన్నారు. 100 శాతం చేరుకొని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. చాలా కాలం క్రితం అమలులో ఉన్న ట్రాఫిక్ పద్ధతి ప్రకారం చాలాన్లు వసూలు చేసేవారని తద్వారా పోలీస్ సిబ్బంది పై ఆరోపణలు వచ్చేవని కానీ క్యాష్ లెస్ పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిపై ఆరోపణలు తగ్గాయన్నారు. ఈ విధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా, క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రకారం పని చేస్తూ బాధితులకు అండగా ఉంటూ నిందితులను శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో ఉండడమే కాక, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ వారు ప్రకటిస్తున్న టాప్ పోలీస్స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్టేషన్లు కూడా అవార్డులు గెలుచుకోవడం గమనించాలని, ఈ రకమైన ప్రశంసలు తమకు కూడా రావాలని రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరూ నిబద్ధతతో పని చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరింతగా పేరు సంపాదిస్తుందన్నారు. శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్, శాంతి భద్రతల ఏఐజి రమణ కుమార్, డిఎస్పి సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.






