- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: నీళ్లు అమ్మి లోన్లు కట్టాలనుకున్నాం.. కాళేశ్వరం కమిషన్ ముందు హరీశ్ రావు

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం ఉందని, ఇంజినీర్ల సూచనల మేరకే వీటి స్థలం మార్పు చేశామని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) కాళేశ్వరం కమిషన్‌కు (Kaleswaram Commission) వివరించారు. నీళ్లు అమ్మి రుణాలు చెల్లించాలని అనుకున్నట్టు వెల్లడించారు. మేడిగడ్డ నిర్మాణం ఏ ఒక్కరి నిర్ణయం కాదని నిర్మాణానికి ముందు మంత్రులు, అధికారులు అనేకసార్లు భేటీ అయ్యారని అని తెలిపారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట హరీశ్‌రావు విచారణకు హాజరు కాగా ఓపెన్ కోర్టులో కమిషన్ చీఫ్ క్రాస్ ఎగ్జామినింగ్ చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రశ్నించిన కమిషన్ అన్నీ నిజాలే చెప్తానని హరీశ్‌తో ప్రతిజ్ఞ చేయించారు. విచారణలో భాగంగా మొత్తం 20 ప్రశ్నలు, వాటికి అనుబంధ ప్రశ్నలను సంధించగా ప్రాజెక్టు డిజైన్, సబ్ కమిటీ ఏర్పాటు, నిర్మాణం అంశాలపై హరీశ్‌రావు క్లుప్తంగా వివరించారు. విచారణకు ముందు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో ఆయన సమాలోచనలు జరిపారు. అనంతరం ర్యాలీగా బీఆర్కే భవన్‌కు చేరుకుని విచారణకు హాజరయ్యారు.
తుమ్మల, ఈటల ప్రస్తావన..
విచారణ సందర్భంగా ఇరిగేషన్ మంత్రిగా ఎన్ని రోజులు పనిచేశారని, మంత్రుల సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసిందని కమిషన్ హరీశ్‌రావును ప్రశ్నించింది. రైతులకు ఎక్కువ నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని, సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్‌తోపాటు తాను ఉన్నట్లు కమిషన్‌కు హరీశ్‌రావు వివరించారు. సీడబ్ల్యూసీ, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగిందన్నారు. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే తుమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు (Madigadda) మార్చినట్లు వివరించారు. అన్నారం సుందిళ్ల లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని కమిషన్ ప్రశ్నించగా లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్ రిపోర్టుల ఆధారంగా జరిగాయని వ్యాప్కోస్ సంస్థ సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మారిందని తెలిపారు. ప్రాజెక్టుల లొకేషన్లు మార్చే అధికారం అప్పటి ప్రభుత్వం హైపవర్ కమిటీకి ఇచ్చిందని హరీశ్ పేర్కొన్నారు.
కొవిడ్ వల్ల రెండేళ్లు డిలే..
కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి అని కమిషన్ ప్రశ్నించగా రుణాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు హరీశ్ రావు వివరించారు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారన్న ప్రశ్నకు నీళ్లను అమ్మి లోన్లను రీ పేమెంట్ చేయాలి అనుకున్నట్టు వివరించారు. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు డిలే అయిందని, అప్పటికే మెదక్‌లో కోకోకోలా కంపెనీ లాంటి సంస్థలు వచ్చాయని చెప్పారు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్‌గా నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్‌పర్ట్ కమిటీ చెప్పిందన్నారు. బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేశారా? అన్న ప్రశ్నకు టెక్నికల్ అంశాలు తమ దృష్టిలో ఉండవని సమాధానం చెప్పారు. కాళేశ్వరం రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశామని హరీశ్ రావు చెప్పారు.
అన్ని ఆధారాలు సమర్పించా..
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు అన్ని ఆధారాలు కమిషన్‌కు సమర్పించానని చెప్పారు. తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని చాలాసేపు ప్రశ్నించారని చెప్పారు. దీనిపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఐదారు సమావేశాలు జరిగాయని, కేసీఆరే స్వయంగా మహారాష్ట్ర వెళ్లి సీఎం ఫడ్నవీస్‌కు చెప్పే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. తమ్మిడిహట్టి వద్ద అనుమతించాలని ఎంత నష్టపరిహారమైనా ఇస్తామని స్పష్టంగా చెప్పినా మహారాష్ట్ర ఒప్పుకోలేదని చెప్పారు.






