- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మునీర్ స్ఫూర్తితో సింగరేణి పరిరక్షణకు కృషి చేయాలి : మంత్రి వివేక్
జర్నలిస్టు ఎండీ మునీర్ జీవితంపై రచించిన ‘మునీర్ భాయ్ ప్రొలిటేరియన్’ పుస్తకాన్ని మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్సీ కోదండరాం ఆవిష్కరించారు.

దిశ, మందమర్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత దివంగత ఎండీ మునీర్ జీవిత విశేషాలపై రచించిన ‘మునీర్ భాయ్ ప్రొలిటేరియన్’ పుస్తకాన్ని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కలిసి ఆదివారం మందమర్రి సీఈఆర్ క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్న సమయంలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి సంస్థను కాపాడేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. అదే సమయంలో మునీర్ తన వార్తల ద్వారా సింగరేణి పరిరక్షణకు మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. మునీర్ స్ఫూర్తితో సింగరేణి పరిరక్షణ కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మునీర్ పాత్ర విశేషమైందని, నిష్పక్షపాత జర్నలిస్టుగా ప్రజల ప్రేమాభిమానాలు పొందారని కొనియాడారు. మునీర్ పేరిట ప్రెస్ భవన్, విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అవసరమైన స్థలంపై సింగరేణి యాజమాన్యంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడు, కార్మిక నాయకుడు, జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడిగా మునీర్ సమాజంపై చెరగని ముద్ర వేశారని అన్నారు. సింగరేణి కార్మిక ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ మునీర్‌ను సాహసోపేత జర్నలిస్టుగా అభివర్ణించగా, మాజీ విప్ నల్లాల ఓదెలు తన జీవితంలో మునీర్ సలహాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






