- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Konda Surekha: సమన్వయం కూడా అవసరం
మహిళా వ్యాపారాభివృద్ధికి WE-HUB దోహదపడుతుందని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా వ్యాపారాభివృద్ధికి WE-HUB దోహదపడుతుందని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. సోమవారం తెలంగాణ సెక్రటేరియట్‌లో WE-HUB సీఈఓ సీత పల్లచొల్లతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్వయం సహాయ సంఘాల మహిళలకు శిక్షణ, మార్కెట్ సాయం, జీవనోపాధి అవకాశాలు, సహకార కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. స్వయం సహాయ సంఘాల మహిళల సాధికారత అనేది కేవలం ఉపాధి విషయంలోనే కాకుండా నాయకత్వం, సృజనాత్మకత, సమగ్ర అభివృద్ధికి మార్గం అని తెలిపారు. అందుకోసం ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయం కూడా అవసరమని చెప్పారు. మహిళా వ్యాపారవృద్ధికి WE-HUB దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ భాగస్వామ్యం వలన కొత్త ఉపాధి అవకాశాలు, మార్కెట్ పోటీ సామర్థ్యం, వరంగల్ తూర్పు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాబోయే మౌలిక సదుపాయాల పనులకూ మానవ వనరుల ప్రణాళికలో మెరుగుదల రావచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు WE-HUB కృషి చేస్తోందని మంత్రి ప్రశంసించారు. అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఐదు SHGల కోసం WE-HUB సహకారం అందించాలని మంత్రి సురేఖ సూచించారు.
ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ, ఉత్పత్తుల నాణ్యత మెరుగుదల, మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్, డిజిటల్, ఆర్థిక విజ్ఞానం, వరంగల్ విమానాశ్రయానికి అవసరమైన సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మంత్రి సురేఖ చెప్పారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, మంత్రి ఓఎస్డీ సుమంత్, పి.ఎస్ సోమరాజు, ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






