- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిలు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి : వీహబ్ సీఈవో సీతా పల్లచోల్ల ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం దేశపు మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్తల నోడల్ సంస్థ వీహబ్ గ్రాస్ రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 'క్యాంపస్ ప్రెన్యూర్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం స్థాపించబడిన భారతదేశపు తొలి రాష్ట్ర నోడల్ సంస్థ WE Hub ఫౌండేషన్ తన ప్రాధాన్య విద్యార్థి పారిశ్రామిక కార్యక్రమమైన ‘క్యాంపస్‌ప్రెన్యూర్’ ను గ్రాస్‌రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (GYIP) కింద అధికారికంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా వీహబ్ సీఈవో సీతా పల్లచోల్ల మాట్లాడుతూ, అమ్మాయిలు కేవలం ఉద్యోగ అన్వేషకులు గానే కాకుండా, ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థినులకు సరైన నైపుణ్యాలు, మార్గదర్శకత్వం అందిస్తే వారు ఆర్థిక స్వయంప్రతిపత్తిని సాధించగలరని అభిప్రాయపడ్డారు. విద్యార్థినుల్లోని నూతన ఆలోచనలకు రూపకల్పన చేసి, వారిని భావి పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ఈ 12 వారాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం కోసం మొత్తం 112 దరఖాస్తులు రాగా, అందులో అత్యంత ప్రతిభావంతమైన 57 బృందాలను (143 మంది విద్యార్థినులు) మొదటి బ్యాచ్ కోసం ఎంపిక చేశారు.
తెలంగాణలోని 9 జిల్లాల నుంచి 26 కాలేజీలు ఇందులో పాల్గొంటున్నాయి. రాష్ట్ర సరిహద్దులు దాటి పూణే, నవీ ముంబై వంటి నగరాల నుంచి కూడా విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, శ్రీనిధి ఇన్స్టిట్యూట్, సీఎంఆర్ ఇంజనీరింగ్, వర్ధమాన్ కాలేజ్, బీవీఆర్ఐటీ, జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ (జీనిట్స్), లయోలా అకాడమీ, ఆర్జీయూకేటీ బాసర వంటి ప్రముఖ కాలేజీల విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు నిపుణులతో మెంటార్‌షిప్, పరిశ్రమల పనితీరుపై అవగాహన, వారి ఆలోచనలను వాణిజ్య నమూనాలుగా మార్చుకోవడానికి అవసరమైన సాంకేతిక మద్దతును వీహబ్ అందిస్తుంది. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లోని నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీహబ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ద్వారా విద్యాసంస్థల్లో సొంత ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి, క్యాంపస్ స్థాయిలోనే పారిశ్రామిక వాతావరణాన్ని పటిష్టం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వీహబ్ డైరెక్టర్ జాహిద్ అక్తర్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఉహా, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.






