కొండంత పని చేసి..గోరంత కూడా చెప్పుకోలేక‌పోతున్నాం: మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి విస్తృతంగా పథకాలను ప్రవేశపెట్టి కొండంత పని చేస్తే.. గోరంత కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కొండంత పని చేసి..గోరంత కూడా చెప్పుకోలేక‌పోతున్నాం: మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి విస్తృతంగా పథకాలను ప్రవేశపెట్టి కొండంత పని చేస్తే.. గోరంత కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో సమాచార, పౌర సంబంధాల శాక క‌మిష‌న‌ర్ సీహెచ్‌. ప్రియాంక‌ కలిసి ఆయా జిల్లాల స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో సంక్షేమ ప‌ధ‌కాల‌ను ప్రవేశ‌పెట్టి అమ‌లు చేస్తూ ముందుకెళ్తున్నా.. చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాయని అన్నారు. నేడు ప్రతిప‌క్షంలో ఉన్న పార్టీ ప‌దేళ్లు అధికారంలో ఉన్న స‌మ‌యంలో చేయని వాటిని చేసిన‌ట్లుగా గోబెల్ ప్రచారంతో ప్రజ‌ల‌ను మ‌భ్యపెట్టింద‌ని ఆరోపించారు. ప్రతిపక్షంలో కూడా అదే ఒర‌వ‌డిని కొన‌సాగిస్తూ ప్రజ‌ల క‌ళ్లకు గంత‌లు క‌డుతోంద‌ని విమ‌ర్శించారు. త‌మ ప్రభుత్వం చేసిన‌ పనులను కూడా పూర్తిగా చెప్పుకోలేక‌పోతోందని పొంగులేటి అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇత‌ర అంశాల‌లో ప్రజలకు ఉపయోగపడే పనులు చేశామని అన్నారు. 60 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేసి దేశంలోనే ఇంత భారీ నియామ‌కాలు చేప‌ట్టిన రాష్ట్రంగా తెలంగాణ‌ను అగ్రప‌థంలో నిలిపామ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం, పేద‌ల‌కు స‌న్నబియ్యం, మ‌హిళ‌ల‌కు రూ.500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌, రైతు భరోసా పెంపు, రుణ‌మాఫీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, డైట్ ఛార్జీలు 40 శాతం పెంపు, ఇందిరమ్మ ఇండ్లు, రేష‌న్‌ కార్డుల పంపిణీ ఇలా రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల సంక్షేమానికి ఎంతో చేశామ‌న్నారు. గ‌త ప్రభుత్వం పదేళ్లలో చేయ‌లేనిది తాము ఏడాదిన్నరలోనే చేసి చూపించామని కామెంట్ చేశారు. కేసీఆర్ పేద‌ల‌కు రేష‌న్ కార్డులు, ఇండ్లు ఇవ్వాలనే ఆలోచ‌న కూడా చేయ‌లేదని ఆరోపించారు. పదేళ్లుగా రేష‌న్ కార్డులలో పేరు న‌మోదు కోసం ఎదురుచూస్తున్న 15 లక్షల మందిని కొత్తగా పాత కార్డులలో చేర్చామని మంత్రి పొంగులేటి అన్నారు. కొత్తగా 7 లక్షల రేష‌న్ కార్డులు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల‌ను విరివిగా ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా పౌర‌ సంబంధాల శాఖ అధికారుల‌దేన‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు.

Next Story