బీజేపీ నియంతృత్వానికి చెక్ పెట్టినాం : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

by Bhoopathi Nagaiah |

బీజేపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా, చట్టవిరుద్ధంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

బీజేపీ నియంతృత్వానికి చెక్ పెట్టినాం : టీపీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా, చట్టవిరుద్ధంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌తో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాజా పరిణామంతో బీజేపీ నియంతృత్వ పోకడలకు, రాజకీయ ఎత్తుగడలకు అడ్డుకట్ట పడిందని స్పష్టం చేశారు.

డీలిమిటేషన్ కుట్ర భగ్నం

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని, అక్రమంగా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును రుద్దాలని చూసిన బీజేపీ కుట్రను ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ భగ్నం చేసిందని అన్నారు. ఈ బిల్లు ద్వారా ఉత్తర భారతానికి అధిక సీట్లు కేటాయించి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూసిన రాజకీయ ఎత్తుగడను కాంగ్రెస్ విజయవంతంగా అడ్డుకుందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.

మహిళా బిల్లుపై బీజేపీ ద్వంద్వ నీతి

మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని టీపీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. 2023లో బిల్లు ఆమోదం పొందినా, 2024 ఎన్నికల్లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 2029 లేదా 2034 అంటూ మహిళలను మోసం చేస్తోందని విమర్శించారు. 2010లోనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా బిల్లును పాస్ చేయించిందని, రాజీవ్ గాంధీ ఆలోచనలతో పీవీ నరసింహారావు ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. 46 ఏళ్ల చరిత్ర గల బీజేపీకి ఇప్పటి వరకు ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేకపోవడం వారి వివక్షకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. తొలి మహిళా ప్రధానిని, ముఖ్యమంత్రిని, రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఆర్టికల్ 370 మీద ఉన్న శ్రద్ధ బీజేపీకి మహిళా బిల్లు మీద ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి ఒక్క బీసీ నాయకుడినైనా తయారు చేశారా..?

బీజేపీ ఒక మనువాద, బీసీ వ్యతిరేక పార్టీ అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కిషన్ రెడ్డి తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క బీసీ లీడర్‌నైనా తయారు చేశారా? అని సవాల్ విసిరారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, రాష్ట్రంపై చూపుతున్న వివక్షకు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దక్షిణాదిపై వివక్ష.. ప్రతిపక్షాల ఐక్యత

తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీజేపీ నేతల మౌనాన్ని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. దేశ నిర్మాణంలో దక్షిణాది పాత్ర గణనీయమని, దానిని తక్కువ చేసే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

Next Story