రాష్ట్రమంతటా మొదలైన గ్రామ సభలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం

by Prasad Jukanti |   (  Updated:2026-04-02 12:07:04  IST  )

తెలంగాణలో 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు

రాష్ట్రమంతటా మొదలైన గ్రామ సభలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ (Praja Palana, Pragathi Pranalika) 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో (99 Days Action Plan) భాగంగా ఇవాళ రాష్ట్రమంతటా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడునెలలు పూర్తయ్యిందని, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ, సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మేం పాలకులం కాదు. సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.

పథకాలు అంటే కాగితాలపై కాదు:

ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయన్నారు. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం అని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతోందన్నారు.

అధికారులకు సూచన:

ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలని ఈ సందర్భంగా సీఎం సూచనచేశారు. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలన్నారు. మహాలక్ష్మి - ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలన్నారు.

ఇది ఓ దీక్ష:

“తెలంగాణ రైజింగ్ – 2047” విజన్‌తో ఆర్థికంగానే కాకుండా, అన్నీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలపాలన్నది మన సంకల్పం అన్నారు. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. CURE, PURE, RARE గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలన్నారు. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదని ఒక దీక్ష అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై... దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలని పిలుపనిచ్చారు. ఇందులో మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.

కేరళలో UDF మేనిఫెస్టో రిలీజ్.. కేరళం సీఎంకు రేవంత్ రెడ్డి చాలెంజ్

Next Story