మేం మారమంతే! మంత్రి ముందే బట్టబయలైన అధికారుల నిర్లక్ష్యం

by Ramesh Naini |

రాష్ట్ర అవతరణ వేడుకలైనా.. జిల్లా అభివృద్ధి సమావేశమైనా ‘మేం మారం అంతే’ అంటూ సిద్దిపేట జిల్లా అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం మారో సారి బయటపడింది.

మేం మారమంతే! మంత్రి ముందే బట్టబయలైన అధికారుల నిర్లక్ష్యం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్ర అవతరణ వేడుకలైనా.. జిల్లా అభివృద్ధి సమావేశమైనా ‘మేం మారం అంతే’ అంటూ సిద్దిపేట జిల్లా అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం మారో సారి బయటపడింది. ప్రణాళికలు లేవు, నివేదికలు లేవు. కట్-పేస్ట్ కాఫీలతో హాజరై.. అడిగితే ‘కొత్తగా వచ్చా, తెలియదు సార్’ అంటూ దాటవేతలు. దీంతో అధికారిక కార్యక్రమాలు అభాసుపాలు కావడం జిల్లాలో పరిపాటిగా మారింది. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో జిల్లా ఇన్ చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై నియోజకవర్గాల పరిధిలోని ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. కానీ, సమావేశానికి విద్య, హౌసింగ్, విద్యుత్, వ్యవసాయ, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కట్-పేస్ట్ కాఫీలు, తప్పుడు నివేదికలతో వచ్చారు. ఆర్టీసీ, యువజన సర్వీసుల శాఖ అధికారులు ఏకంగా గైర్హాజరయ్యారు. సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారి నిర్మాణానికి నిధుల కేటాయింపు ప్రపోజల్ చూసి మంత్రి వివేక్ వెంకటస్వామి అవాక్కయ్యారు. విషయంపై ఆరా తీయగా ‘గణాంకాలు తప్పుగా ప్రింట్ అయ్యాయి’ అని అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అదే విధంగా రెండు పడక గదుల ఇళ్ల లాస్ట్ పేమెంట్ జిల్లాలో కేవలం 4 డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మాత్రమే వచ్చిందని సంబంధిత శాఖ అధికారి నిర్లక్ష్యంగా తప్పుడు సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వెంటనే నివేదికలు తెప్పించి చూడటంతో జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు ఫుల్ పేమెంట్లు జరుగుతున్నాయని, నిర్మాణం వేగంగా సాగుతున్నట్లు మంత్రికి వివరించారు.

కొత్తగా వచ్చా.. నివేదికలు లేవు!

‘నివేదికలు లేవు’, ‘కొత్తగా వచ్చా’ అంటూ పలు శాఖల అధికారులు సమాధానాలు ఇవ్వడంతో జిల్లా అభివృద్ధి సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ పక్కదారి పట్టింది. ఏ శాఖలో ఏ పనులు పెండింగ్‌లో ఉన్నాయి, పనులు ఎంతవరకు వచ్చాయి, రాష్ట్రస్థాయిలో ఏ శాఖ వద్ద ఫైళ్లు ఆగాయి, జిల్లా అభివృద్ధికి ఏం చేయాలి అనే అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా.. అధికారుల నిర్లక్ష్యంతో సమావేశం నవ్వులపాలైంది. రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లలో అలసత్వం వహించిన ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు, 150 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి నెల రోజులు కూడా గడవక ముందే మళ్లీ అదే తీరు పునరావృతమవ్వడంతో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.‘మేం మారం’ అంటున్న అధికారుల తీరుపై జిల్లా ఇంఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.

Next Story