ఆర్మూర్‌లో హీటెక్కిన రాజకీయం..!

by Jakkula.Mamatha |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

ఆర్మూర్‌లో హీటెక్కిన రాజకీయం..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన విసిరిన రాజకీయ సవాల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలు, విసిరిన సవాళ్లు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రిపై కూడా రాకేశ్ రెడ్డి విమర్శలు చేయడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.

ఆర్మూర్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసి రెండు వందలకు పైగా వినతి పత్రాలు సమర్పించినప్పటికీ జిల్లాకు తగిన నిధులు కేటాయించడం లేదని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఇతర జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తూ నిజామాబాద్ జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకుని "దమ్ముంటే ఆర్మూర్‌లో పోటీ చేయాలి" అని సవాల్ విసిరారు. అవసరమైతే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

కాంగ్రెస్ నుంచి ఘాటు ప్రతిస్పందన..

రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాకేష్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనను ఓడించడానికి టీపీసీసీ అధ్యక్షుడు అవసరం లేదని, కాంగ్రెస్ సాధారణ కార్యకర్తే సరిపోతాడని సవాల్ విసిరారు. ఒకవేళ ఓడించలేకపోతే తామే రాజకీయ సన్యాసం చేస్తామని భీమ్‌గల్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు.

హామీలపై కాంగ్రెస్ విమర్శలు..

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు రాజకీయ సవాళ్లతో కాలం గడుపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సొంత నిధులతో పేదలకు ఇళ్లు నిర్మిస్తానని, హైదరాబాద్‌లో అందిస్తున్న తక్కువ ఖర్చు వైద్య సేవలను ఆర్మూర్‌లోనూ అందుబాటులోకి తీసుకొస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.

అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న ప్రజలు..

రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఆర్మూర్ అభివృద్ధి వెనుకబడుతోందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరిస్తూ నిధులు, అభివృద్ధి పనులు సాధించడంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ఘర్షణలు పెరగడం వల్ల నష్టపోయేది చివరకు ప్రజలేనని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే అది రాజకీయ కక్షసాధింపుగా భావించాల్సి వస్తుందని, అదే సమయంలో సమస్యల పరిష్కారానికి పరస్పర సహకారం కూడా అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికలకే పరిమితమవని రాజకీయాలు..

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని, అనంతరం అభివృద్ధే లక్ష్యమని అన్ని పార్టీలు ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయ పోరు కొనసాగుతుండటంతో అభివృద్ధి అంశాలు వెనుకబడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకే అభివృద్ధి పనులు సులభంగా సాధ్యమవుతున్నాయనే భావన బలపడుతోంది. ఈ పరిస్థితుల వల్లే గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరే ధోరణి కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ విభేదాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తేనే ఆర్మూర్‌తో పాటు అన్ని నియోజకవర్గాల అభివృద్ధి వేగవంతమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story