అనర్హులకు తెలంగాణ సర్కార్ ఝలక్.. రాష్ట్రవ్యాప్తంగా మరో లక్ష పింఛన్లు కట్!

by Kema Shiva Kumar |

తెలంగాణలో లక్ష మందికి పైగా అనర్హులు, చనిపోయిన వారి పేరు మీద కొందరు పెన్షన్లను పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.

అనర్హులకు తెలంగాణ సర్కార్ ఝలక్.. రాష్ట్రవ్యాప్తంగా మరో లక్ష పింఛన్లు కట్!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున జరుగుతున్న పెన్షన్ల అక్రమాలను తాజాగా అధికార యంత్రాంగం బట్టబయలు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా అనర్హులు అక్రమంగా నెలవారీగా పెన్షన్లను అందుకుంటున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇందులో కొన్నేళ్ల క్రితమే చనిపోయిన వారి పేరుపై కూడా కొందరు అక్రమార్కులు ఆశతో నెలనెలా డబ్బులు డ్రా చేస్తున్నట్లుగా డ్రా చేస్తున్నట్లు నిఘా వర్గాలు, క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. సాంకేతికత ఆధారంగా చేపట్టిన లైఫ్ అథెంటికేషన్ అంటే బతికే ఉన్నారా లేదా అని నిర్ధారించే ప్రక్రియ ద్వారా దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి. దీంతో తక్షణమే స్పందించిన ప్రభుత్వం చనిపోయిన, అర్హత లేని వారి పేర్లను పెన్షన్ల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దాదాపు 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్..

అయితే, రాష్ట్రంలో పెన్షన్ జాబితా నుంచి అనర్హుల తొలగింపు ద్వారా మిగిలే నిధులను వృథా చేయకుండా నిజమైన నిరుపేదలు, అర్హులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాగా, తాజాగా గుర్తించిన లక్ష మంది అనర్హుల స్థానంలో.. మరో లక్ష మంది కొత్త అర్హులకు పెన్షన్లను త్వరలోనే మంజూరు చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి ఆర్థిక శాఖ కూడా కసరత్తు ముమ్మరం చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా దాదాపు 3 లక్షల మందికి పెన్షన్ సౌకర్యం లభించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏళ్ల తరబడి పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులకు పెద్ద ఊరట లభించినట్లయింది. త్వరలోనే ఈ అర్హుల తుది జాబితాను విడుదల చేసి, కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

Next Story