ఓటర్ల జాబితా ఆధారంగానే ‘ఎస్‌ఐఆర్‌’ ఫారాల భర్తీ: తహసీల్దార్ రమేశ్

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-05 06:02:21  IST  )

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరుకు అందజేస్తున్న ఎస్‌ఐఆర్‌ ఫారాలను ప్రజలు సరైన విధంగా భర్తీ చేయాలని తలకొండపల్లి తహసీల్దార్ రమేష్ సూచించారు.

ఓటర్ల జాబితా ఆధారంగానే ‘ఎస్‌ఐఆర్‌’ ఫారాల భర్తీ: తహసీల్దార్ రమేశ్
X

దిశ,తలకొండపల్లి: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరుకు అందజేస్తున్న ఎస్‌ఐఆర్‌ ఫారాలను ప్రజలు సరైన విధంగా భర్తీ చేయాలని తలకొండపల్లి తహసీల్దార్ రమేష్ సూచించారు. 2002 ఓటరు జాబితాను ఆధారంగా తీసుకుని ఫారంలోని వివరాలు ఎక్కడ కూడా కొట్టివేతలు లేకుండా నమోదు చేయాలని ఆయన తెలిపారు. 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు అప్పటి నమోదైన పేరు, తల్లిదండ్రుల లేదా భర్త పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఓటరు నమోదు సంఖ్య తదితర వివరాలు పరిశీలించి అదే ప్రకారం.. ఫారాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఫారంలో ఎలాంటి ఖాళీలు వదిలిపెట్టకుండా స్పష్టంగా వివరాలు నమోదు చేయాలని, ఆధార్, జనన తేదీ, చిరునామా వంటి వివరాలను ఒకటికి రెండుసార్లు సరి చూసుకుని సంతకం చేయాలని తెలిపారు.

ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బీఎల్‌ఓ, గ్రామస్థాయి అధికారులు లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రక్రియ అని పేర్కొన్న తహసీల్దార్ రమేష్, ప్రతి అర్హత కలిగిన ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో బీఎల్‌వోలకు నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాల నేతలు సహకరించాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామాలలో చాలా మందికి ఇండ్లు భూములు ఉన్నా కూడా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అలాంటి వారికి నేరుగా ఫోన్ చేసి వారి ఓటు హక్కును గ్రామంలో ఉంచుకుంటారా లేదా హైదరాబాదులో ఉంచుకుంటారా ఇతర పట్టణాల్లో ఉంచుకుంటారా అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని వారికి అవగాహన కల్పించాలని తహసీల్దార్ రమేష్ సూచించారు.


Next Story